అసోం అల్లర్లపై అట్టుడికిన లోక్‌సభ
ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసిన అధ్వానీ
న్యూఢిల్లీ, ఆగస్టు 8 : అస్సోంలో చెలరేగిన హింసను ఆపడంలో కేంద్ర ప్రభుత్వం విఫల మైందని భారతీయ జనతా పార్టీ లోక్‌సభ సభ్యుడు ఎల్‌కె అద్వానీ ధ్వజమెత్తారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు బుధవారం ఉదయం ప్రారంభం కావడం.. అస్సోం అల్లర్లపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టడం.. గందరగోళం నెలకొనడంతో అరగంటసేపు సభను స్పీకర్ మీరాకుమార్ వాయిదా వేయడం.. తిరిగి సభ ప్రారంభం కాగానే అస్సోం అల్లర్లపై బిజెపి వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టడం.. తెలిసిందే. లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ అస్సోం అల్లర్లపై చర్చకు అనుమతి ఇచ్చారు. ఎల్‌కె అద్వానీ మాట్లాడుతూ అస్సోంలో అల్లర్లు చోటు చేసుకోవడం దురదృష్టకరమన్నారు. అస్సోంలో జరిగిన అల్లర్లకు కేంద్రమే బాధ్యత వహించాలని డిమాండు చేశారు. అస్సోంలో జరిగిన అల్లర్లు మత ఘర్షణలు కావని చెప్పారు. వాటిని హిందూ-ముస్లిం సోదరుల మధ్య జరిగిన అల్లర్లుగా భావించొద్దని కేంద్ర ప్రభుత్వానికి హితవు పలికారు. అక్రమ వలసల వల్లే అస్సోంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. అస్సోంలో తలెత్తిన అల్లర్లు 2 లక్షల మంది ప్రజలపై ప్రభావం చూపాయన్నారు. అక్రమ వలసలను నివారిస్తేనే సాధారణ పరిస్థితులు నెలకొంటాయని చెప్పారు. ప్రభుత్వ అసమర్ధత వల్లే అస్సోంలో చొరబాట్లు ఎక్కువయ్యాయన్నారు. ఇది రెండు దేశాల మధ్య నెలకొన్న సమస్య అని చెప్పారు. భారతీయులు-బంగ్లాదేశీయుల మధ్య నెలకొన్న విభేదాల వల్లే అల్లర్లు ఉత్పన్నమయ్యాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది ఇరుదేశాల సమస్య అని, కేంద్ర ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకుని పరిష్కారించాలని కోరారు. అల్లర్ల నేపథ్యంలో నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనన్నారు. వలసవాదుల పట్ల కేంద్రం ఎందుకు కరుణ చూపుతుందో అర్ధం కావడం లేదన్నారు. ప్రధాని మన్మోహన్‌సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్న అస్సోంలో అల్లర్లు చోటు చేసుకోవడం విచారకరమన్నారు. యుపిఎ-2 ఎన్నిక అక్రమమన్నారు. 2009 ఎన్నికల్లో కోట్లాది రూపాయలను ఖర్చు పెట్టి యుపిఎ-2 ప్రభుత్వం ఏర్పాటైందని ఆరోపించారు. అద్వానీ ప్రసంగానికి లోక్‌సభ నాయకుడు సుశీల్‌కుమార్ షిండే అడ్డుకున్నారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. ఒక దశలో యుపిఎ చైర్‌పర్సన్ సోనియాగాంధీ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సభలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. పరిస్థితి అదుపు తప్పుతుండడంతో సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ మీరాకుమార్‌ప్రకటించారు.