ఆక్స్‌ఫర్డ్ వర్సిటీలో భారత విద్యార్థి ఘన విజయం
– విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా రష్మీ సమంత్
లండన్,ఫిబ్రవరి 14(జనంసాక్షి):ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం ఎన్నికల్లో భారతీయ విద్యార్థిని రష్మీ సమంత్ చరిత్ర సృష్టించింది. 2021-22 సంవత్సరానికి సంబంధించి గురువారం జరిగిన ఈ ఎన్నికల్లో.. ఆక్స్‌ఫర్డ్ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షురాలిగా గెలుపొందింది. ఒక భారతీయ విద్యార్థిని ఈ పదవిని దక్కించుకోవడం ఇదే తొలిసారి! ఈ ఎన్నికల్లో మొత్తం 3,708 ఓట్లు పోలవ్వగా, ఒక్క రష్మీకే 1,966 ఓట్లు వచ్చాయి. ఆమె ప్రస్తుతం ఆక్స్‌ఫర్డ్ వర్సిటీకి అనుబంధంగా ఉన్న లినకా కళాశాలలో ఎనర్జీ సిస్టమ్స్‌లో పీజీ చదువుతోంది. ఇంతకుముందు రష్మీ కర్ణాటకలోని మణిపాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది.