ఆచరణ సాధ్యం కాని హావిూలు
ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు ఇచ్చే హావిూలు ఒక్కోసారి అమలు సాధ్యమేనా అన్న ఆందోళన కలుగుతోంది. ఆచరణ సాధ్యం కాని హావిూలతో ప్రజలను బురిడీ కొట్టించడంలో ఇప్పుడు రాజకీయ పార్టీలు రాటుదేలాయి. ప్రస్తుత తెల్గాణ అసెంబ్లీ ఎన్నికలలో ఓటర్లను ఆకర్షించేందుకు అన్ని పార్టీలు తమ శక్తివంచన లేకుండా హావిూలను గుప్పిస్తున్నాయి. అవి ఒకరిని మించి ఒకరివి ఉంటున్నాయి. తాజాగా బిజెపి ముసాయిదా ఎన్నికల ప్రణాళికలో ఇంటి కిరాయి రెండువేల హావిూని ప్రస్తావించింది. ఉచిత పథకాలకు దూరం అంటూ వచ్చిన బిజెపి నేతలు ఇలాంటి అమలు సాధ్యం కానీ హావిూలతో ప్రజలను బోల్తాకొట్టించా లనుకోవడం సరికాదు. ప్రజలను స్వంత్రంగా నిలబెట్టే కార్యక్రమాలు చేపట్టాలే గానీ అన్ని ఉచితం అని చెప్పి అధికారంలోకి వచ్చాక చతికిల పడడం చూస్తున్నాం. అందువల్ల హావిూలకు ఓ హద్దూపద్దూ ఉండాలి. మన తెలంగాణ బడ్జెట్ ఎంత..ఏ రంగానికి ఎన్ని కేటాయింపులు చేస్తే, ఏ మేరకు సర్దుబాటు చేయగలమో చెప్పేలా పథకాల రచన ఉండాలి. ఎన్నికల హావిూలు, మేనిఫెస్టోల ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించేకన్నా వాస్తవాలు చెప్పగలగాలి. అలాగే ఎదుటి పార్టీలు అలా చేస్తే నిలదీయాలి. ఎన్నికల సంఘం కూడా ఇలాంటి హావిూలపై ఆంక్షలు విధించాలి. బడ్జెట్‌ను మించి చేస్తున్న వాగ్దానాలపై పరిమితి ఉండాలి. ప్రజల నుంచి పన్నల రూపంలో వస్తున్న బడ్డులను దక్షతతో ఖర్చు పెట్టగలమన్న ధీమా ప్రజలకు కలిగించాలి. అంతేగానీ అధికరామే పరమావధిగా అరచేతిలో వైకుంఠం చూపరాదు. గత ఎన్నికల్లో కెసిఆర్ ఇచ్చిన హావిూలు అమలు కాకపోవడానికి బడ్జెట్ పొంతలను కుదరకపోవడమే ప్రధాన కారణం. సంక్షేమ రంగంలో విపరీతమైన హావిూలు గుప్పించి చేస్తున్న కార్యక్రమాలు అభివృద్దిని దెబ్బతీసాయి. అందుకే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, కిలో రూపాయి బియ్యం పథకం, ఉచిత విద్యుత్, మూడెకరాల భూ పంపిణీ, రైతుబందు వంటి పథకాలు గుదిబండగా మారాయి. పొడుగోన్ని కొట్టి పొట్టోనికి పెట్టడం కాదు. పొట్టోని స్థాయిని పెంచగలగాలి. సంక్షేమానికి, అభివృద్ధికి సంబంధించిన విషయాలలో సమతుల్యత లోపించకుండా చూసుకోవాలి. ఇచ్చిన హావిూలను విస్మరిస్తే విశ్వసనీయత ఎట్లా లభిస్తుందన్నది చూసుకోవడం లేదు.
అంటువంటి స్థితిలో ప్రజలు కేవలం హావిూలను చూసి మోసపోకుండా పాలకుల సమర్థతను కూడా అంచనా వేసుకోవాల్సి ఉంటుంది. ఎన్‌టిఆర్ తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసినపుడు అప్పటి సమయాన్ని బట్టి, ప్రజల అవసరాల మేరకు పేదలకు రెండు రూపాయలకు కిలో బియ్యం ఇస్తామని ప్రకటించారు. దీర్ఘకాలంపాటు తమిళనాడులో ఉండిన ఆయనపై అక్కడి సంక్షేమ పథకాల ప్రభావం బాగా ఉండేది. బియ్యం పథకం అక్కడ ఉండడం అలాంటి ఇక్కడ లేకపోవడంతో బాగా కలసి వచ్చింది. కానీ దానిని రెండు దశాబ్దాల తరవాత కాంగ్రెస్ పాలకులు రూపాయికి కుదించి బడ్జెట్ భారాన్ని పెంచారు. దీన్ని ఎలా సమర్థించుకుంటారో చెప్పాలి. ఇలాంటి పథకం వల్ల ఉపయోగమేమిటో చెప్పాలి. ఇది ఎంతగా అవినీతి పాలయ్యిందో గుర్తించాలి. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబుకు మధ్య పోటీ ఏర్పడినపుడు కూడా ఉచిత విద్యుత్ ప్రస్తావన వచ్చింది. వైఎస్‌ఆర్ మొదటిసారిగా 2004లో గెలిచిన తర్వాత ఉచిత విద్యుత్‌ను అమలు చేసారు. ఈ పథకం ఇప్పటికీ కొనసాగుతోంది. ప్రజల డబ్బుతో దీనిని కొనసాగిస్తున్నా దీని భారం ఎంతన్నది చెప్పలేకపోతున్నారు. బియ్యం, ఉచిత కరెంట్, రైతుబంధు డబ్బుల చెల్లింపులు ఏటేటా తడిసి మోపెడు అవుతున్న పథకాలు. ఇవి ఎప్పటికి పూర్తవుతాయో ప్రజలు ఎప్పుడు బగు పడతారో చెప్పలేం. ఈ సందర్భంలో అన్ని రాజకీయ పార్టీలు ఆలోచించి తమ మ్యానిఫెస్టోలు ప్రకటించాల్సి ఉంది.
ఎన్నికలు వచ్చినపుడు ఎట్లాగైనా గెలవాలని పట్టుదల రాజకీయ పార్టీలకు ఉండడం సహజం. అందుకని
అర్థంపర్థం లేని పథకరాలతో ప్రజలను మోసం చేయడం కూడా తప్పే. హావిూలను ప్రజలు ఒక వేళ నమ్మగలరేమో కానీ పాలనలో అమలు కాకపోతే మొత్తంగానే విశ్వసించరు.
విశ్వసనీయత ముందు ఎంతటి హావిూలు అయినా ప్రజల దృష్టిలో నిలవవు. ఎన్నికల హావిూలు, మేనిఫెస్టోల ద్వారా ఇపుడు ప్రజలను కొత్తగా మెప్పించవలసి వచ్చినప్పుడు గత పథకాలను విశ్లేషించాలి.
భాజపాకు అధికారం కట్టబెడితే అమలు చేస్తామంటూ వివిధ హావిూలను రంగాలవారీగా మేనిఫెస్టోలో పొందుపరిచింది. రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ సహా పలు అంశాలను ఇప్పటికే చేర్చింది. తాజాగా మరికొన్నింటిని ముసాయిదాలో చేర్చారు. తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజల అవసరాలు తీర్చేలా ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించామని తెలిపారు. ఇందుకోసం అన్ని వర్గాల ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించామన్నారు. తాము అధికారంలోకి వస్తే పేదలకు ఏటా లక్ష ఇళ్లు కట్టిస్తామని, ఇల్లు రాని వారికి నెలకు రూ.2 వేల అద్దె చెల్లిస్తామన్నారు. ఏకకాలంలో డీఎస్సీ నిర్వహించి 30 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు. బాల కార్మికులు, వితంతువుల అంశాలను ప్రత్యేకంగా రూపొందించామన్నారు. బ్రాహ్మణ, మున్నూరు కాపు, రెడ్డి, వైశ్య కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అగ్రవర్ణాల్లోని పేదలకు రిజర్వేషన్లు కల్పించి ఆదుకునేలా మేనిఫెస్టోను రూపొందించామన్నారు. ఇలాంటి హావిూలు ఇచ్చే ముందు సవిూక్షించుకుంటే అన్ని పార్టీలకు మంచిది.