ఆత్మగౌరవంగా బతకాలనే సోనియా తెలంగాణ ఇచ్చారు
ఏడేళ్లుగా ఖర్చు పెట్టని ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు
మూడుచింతలపల్లి దళి,గిరిజన ఆత్మగౌరవ సభలో భట్టి
హైదరాబాద్,అగస్టు24(జనంసాక్షి): తెలంగాణలో స్వపరిపాలన, ఆత్మగౌరవంతో నిలబడాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లిలో చేపట్టిన దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్షలో భట్టి మాట్లాడారు. ఏ లక్ష్యాల సాధన కోసం తెలంగాణ ఏర్పాటు చేశారో అవి ఈరోజు నెరవేరడం లేదని అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణలో అత్యంత వెనకబడిన వర్గాలను తలెత్తుకొని జీవించేలా చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను ఏడేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం ఖర్చు పెట్టడం లేదని
ఆక్షేపించారు. నిధులు ఖర్చు కాకపోతే మరో ఏడాది కేటాయింపులకు ఈ నిధులను బదిలీ చేయాల్సి ఉండగా.. అలా ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. దళిత, గిరిజనులకు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీయడానికే కాంగ్రెస్ పార్టీ దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్షలు చేపట్టిందని స్పష్టం చేశారు. ఆత్మగౌరవంతో బతకాలనుకునే ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలని కోరారు. దళిత బంధును హుజూరాబాద్‌కే పరిమితం చేయకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం అయ్యాక కాంగ్రెస్ పార్టీకి కొత్త ఉత్సాహం వచ్చింది. మూడుచింతలపల్లిని సీఎం కేసీఆర్ దత్తత తీసుకొని ఏం చేశారు? దత్తత అంటే గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాల్సి ఉంటుందని మాజీమంత్రిపొన్నాల వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు ఇక్కడ ఎలాంటి అభివృద్ధి చేపట్టలేదు. కాంగ్రెస్ హయాంలో చాలా గ్రామాలను అభివృద్ధి చేసి చూపించాం. ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాం. కేసీఆర్.. డబుల్ బెడ్ రూమ్‌లు ఎక్కడ ఇచ్చారో చెప్పాలి. హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసమే పదవులు ఇస్తున్నారు.. పథకాలు తీసుకొస్తున్నారు. 2014లోనే సీఎం కేసీఆర్‌పై సీబీఐ మూడు కేసులు నమోదు చేసింది. రానున్న రోజుల్లో కేసీఆర్‌కు జైలు జీవితం తప్పదని పొన్నాల వ్యాఖ్యానించారు.