ఆత్మవిమర్శకు ఇదే అసలు సమయం

తెలంగాణ ఉద్యమ సమయం వేరు…ప్రస్తుత పరిస్థితులు వేరు.. తెలంగాణ ఏర్పడడం, ఏర్పడ్డ తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా కెసిఆర్‌ సిఎం కావడం.. 9నెలల ముందే ఎన్నికలకు వెళ్లడం ద్వారా ఓ చారిత్రకఘట్టం ఆవిర్భవించింది. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ అసెంబ్లీ కాలపరిమితి ఐదేళ్లు కూడా లేకుండా పోయింది. కారణం ఏదైనా అసెంబ్లీకి కెసిఆర్‌ కోరుకున్నట్లుగానే ముందస్తు ఎన్నికలు వస్తున్నాయి. ఈ దశలో గతంలో ఇచ్చిన మేరకు దళిత ముఖ్యమంత్రి హావిూ వెనక్కి పోయింది. తెలంగాణ హావిూలు అనేకానేకం కూడా వెనక్కి పోయాయి. ఎన్నికలు సవిూస్తున్న వేళ మళ్లీ సిఎం కెసిఆర్‌ అంటూ తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు ఊరూవాడా ప్రచార¬రు చేపట్టారు. కాంగ్రెస్‌ గెలిస్తే..పొరపాటున గెలిస్తే నెలకో ముఖ్యమంత్రి అంటూ ప్రచారం చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఉండే ముఖ్యమంత్రి కావాలా…ఢిల్లీ నిర్ణయించే నెలకో ముఖ్యమంత్రి కావాలా అంటూ ప్రజల్లో ప్రచారంలో దూసకుని పోతున్నారు. అలాగే కాంగ్రెస్‌ గెలిస్తే 24 గంటల కరెంట్‌ రాదని… రైతుబందు పథకం అడ్రస్‌ లేకుండా పోతుందని..కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు ఆగిపోతా యని కూడా ప్రచారం చేస్తున్నారు. అలాగే కాంగ్రెస్‌ పాలన ఇవాళ మనకేం కొత్తకాదని కూడా అంటున్నారు. ఓ రకంగా చెప్పాలంటే కొత్తగా ఏర్పడ్డ తెలంగాణలో టిఆర్‌ఎస్‌ నేతలే పాతముఖాలు. వారి నాలుగేళ్ల పాలన ను ప్రజలు రుచి చూశారు. కాంగ్రెస్‌, బిజెపి నేతల పాలనే ఎలా ఉంటుందన్నది ఈ తెలంగాణ ప్రజలకు తెలియదు. ఉమ్మడి ఆంద్రప్రద్రేశ్‌ వేరు.. ప్రత్యేక తెలంగాణ వేరు. పాముఖాలని చెప్పాల్సి వస్తే టిఆర్‌ఎస్‌ నేతలే ముందుంటారు. కాబట్టి అది ప్రచారాంశంగా చూడరాదు. ఇకపోతే నిజానికి ప్రజలకు ఎవరు ముఖ్య మంత్రి కావాలన్నది అప్రస్తుతం..ఎవరు తమ సమస్యలను పరిష్కరించారన్నది ముఖ్యం…కెసిఆర్‌ దళిత ముఖ్యమంత్రి హావిూ ఇచ్చి, తానే ముఖ్యమంత్రి అయినా ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. తమ సమస్యలను పరిష్కరించే నేతగా కెసిఆర్‌ సఫలం అయ్యాడా లేదా అన్నదే వారు ఆలోచన చేస్తున్నారు. అందుకే రేపటి ఎన్నికల్లో కెసిఆర్‌ ముఖ్యమంత్రా లేక..కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రోజుకో ముఖ్యమంత్రి ఉంటారా అన్నది కూడ వారి ఆలోచనల్లో లేదు. వచ్చిన తెలంగాణలో ప్రజల సమస్యలు ఏ మేరకు పరిష్కారం అయ్యాయి. ఇచ్చిన హావిూలు ఏ మేరకు నెరవేర్చారన్నది మాత్రమే చూస్తారు. ఈ ఎన్నికల్లో ఇప్పుడు ఇదే ప్రధాన అంశంగా మారనుంది. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణలో కాంగ్రెస్‌, టిడిపి, బిజెపి, లెఫ్ట్‌ పార్టీల పాత్ర ఏ మత్రం లేదు. కర్త,కర్మ,క్రియ అంతా కెసిఆర్‌ తానై నడిపారు. తానే అధినేతగా తను అనుకున్న విధాంగానే కార్యక్రమాలు జరిపారు. కాళేశ్వరం మొదలు, చెరువుల పూడికతీత వరకు అంతా కూడా కెసిఆర్‌ ఇష్టాను సారమే తప్ప ప్రజాభీష్టం మేరకు జరగలేదు. అలా జరిగివుంటే హైదరాబాద్‌లో ఒక్క చెరువయినా బాగు పడేది. భూకబ్జాలు ఆగేవి. చెరవుఉల ఆక్రమణలు ఆగిపోయేవి. నటుడు నాగార్జున ఆక్రమించుకున్న చెరువు శిఖం ప్రభుత్వ పరమయ్యేది. హైదరాబాద్‌ రోడ్లు అద్దంలా మారేవి. బడీచౌడీ నుంచి మెట్రో మార్గం ఆగి పోయేది. కరీంనగర్‌ రాజీవ్‌ రహదారి వంకలు సక్కగయ్యేవి. కానీ వీటన్నిటిపైనా చర్చ లేకుండా చేశారు. అడిగితే ఎదురుదాడి చేస్తూ వచ్చారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ను, టిడిపిని విమర్శిస్తూ పోతున్నారు. కానీ ప్రచారంలో ఇవన్నీ ఎందుకన్నదే ముఖ్యం. మన తెలంగాణను మనం అభివృద్ది చేసుకుంటే ఎవరో వచ్చి ఆపారని చెప్పడం ఎవరికీ అర్థం కాని ప్రశ్న. ఇప్పటికీ చంద్రబాబును, కాంగ్రెస్‌ను ఆడిపోసుకోవడం తెలంగాణ అభివృద్ది ఎలా అవుతుందో నేతలు చెప్పలి. నాలుగేళ్లలో ఖచ్చితంగా ఫలానా చేశామని చెప్పగలిగే కార్యక్రమాలను ప్రజలకు వివరించాలి. పెన్షన్లు ఇవ్వడం, డబ్బుల పందేరం చేయడం అభివృద్ది కోవలోకి వస్తుందనుకుంటే ప్రజలు నవ్వుతారు. నాలుగేళ్ల పాలనకు సంబంధించిన మంచి చెడ్డలూ,

టిఆర్‌ఎస్‌ రాజకీయ విజయాలు వివరించుకోవాలి. తెలంగాణలో మొదటి ప్రభుత్వాన్ని తొమ్మిది మాసాల ముందే ఎందుకు రద్దు చేసుకున్నారో చెప్పాలి. ఎదురుదాడి చేస్తూ వెటకారాలు మాట్లాడడం సరికాదు. బంగారు తెలంగాణకు కష్టపడితే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ, కేసులు వేస్తూ అడ్డుకున్నాయిని చెప్పడం కారణంగా చూడలేం. ప్రజాస్వామ్యంలో విమర్శలూ కేసులూ తప్పు కాదు కదా ఎల్లప్పడూ ఉండనే ఉంటాయి. వాటిని ఎదుర్కోవడమే నాయకుడి లక్షణం. రాష్ట్ర విభజనకు ముందు సంగతులనే ఇంకా పదేపదే మాట్లాడడం బంగారు తెలంగాణ కానేరదు. ఇప్పుడు ప్రజలు తమకు అనుకూలంగా ఎందుకు తీర్పు ఇవ్వాలో..ప్రజలు ఎందుకు కెసిఆర్‌ వెన్నంటి నడవాలో చెప్పుకోవాలి. వాస్తవంగా ఇది కెసిఆర్‌ పాలనపై ప్రజలు తీర్పు ఇచ్చే సమయం. ప్రగతి నివేదన అంటూ మొదలుపెట్టిన వారు ప్రతిపక్షాలపై విరుచుకు పడటానికే పరిమితమయితే సరిపోదు. మిషన్‌ భగీరథ, డబుల్‌బెడ్‌రూంలు ,ఉద్యోగ నియామకాలు ఇంకా అనేక ప్రతిజ్ఞలు అసంపూర్ణంగా వుండిపోయాయనే ఆత్మ విమర్శ చేసుకోగలగాలి. ఇవన్నీ సాకారం చేయకుంటే ఓట్లు అడగనని చెప్పి ఎందుకు అడగాల్సి వచ్చిందో చెప్పాలి. ఆత్మగౌరవం గురించి, ఢిల్లీ తాకట్టు గురించి ఇంకా చెప్పడం సరికాదని గుర్తుంచుకోవాలి. తెలంగాణ సిద్ధించిన తర్వాత సర్వం సహాధికారం చలాయించిన కెసిఆర్‌ ఇంకా పూర్వాశ్రమ వ్యవహారాలను మాట్లాడరాదు. అది నాయకత్వ లక్షణం కూడా కాదు. ఉద్యమ సింహంగా చెప్పుకుంటున్న లేదా ప్రచారం చేస్తున్న వ్యక్తి ఇలా ప్రజలకు దూరంగా ఉంటూ, ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతే ఎలా? ప్రజలు తనగురించి ఏం మాట్లాడుకుంటున్నారో వినాలి. తెలంగాణ ఏర్పడితే ఏ ఉద్యమం అవసరం లేదని చెప్పి ఉద్యమాలను అణచివేయడం సరైనదా అన్నది ఆలోచనచేయాలి. నీళ్లు నిధులు నియామకాలనే నినాదం ఎంతమేరకు సాధించామో చెప్పుకోగలగాలి. అప్పులు చేస్తూ, మనది ధనిక రాష్ట్రమని చెప్పుకోవడం ద్వారా ఆత్మవంచన ఎందుకు చేసుకోవాల్సి వస్తుందో ఆత్మవిమర్శ చేసుకోవాలి. వైఫల్యాలు తప్పు కాదు. వాటిని సవరించుకోవచ్చు. టిడిపి కాంగ్రెస్‌ పొత్తు ఏ మేరకు ఫలితాలిస్తుందో గాని దానిని చూస్తేనే భయపడు తున్నట్లుగా టిఆర్‌ఎస్‌ నేతలు ప్రచారం చేయడం ముందస్తు ఓటమిని అంగీకరించినట్లుగా ఉంది.