ఆయోధ్యలో 144 సెక్షన్
అయోధ్య: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిర నిర్మాణం చేపట్టాలన్న డిమాండ్‌తో విశ్వహిందూ పరిషత్, శివసేన ధర్మసభలకు పిలుపునివ్వడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ధర్మసభ పేరుతో విశ్వహిందూ పరిషత్ ఆదివారం భారీ కార్యక్రమం చేపట్టేందుకు సిద్ధమైంది. మరోవైపు శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే కూడా నేడు అయోధ్యకు బయల్దేరారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు అయోధ్యలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. వందల మంది పోలీసులు మోహరించారు. ఈ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు.
దాదాపు 2 లక్షల మందితో ఆదివారం ధర్మసభ చేపడుతామని విశ్వహిందూ పరిషత్ ప్రకటించింది. సభ వల్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉండటంతో పోలీసులు భద్రతను పెంచారు. మరోవైపు రెండు రోజుల పర్యటన నిమిత్తం ఉద్ధవ్ థాకరే నేడు అయోధ్యకు బయల్దేరారు. మధ్యాహ్నం 1.30గంటల ప్రాంతంలో ఆయన ఇక్కడకు చేరుకోనున్నారు. అనంతరం లక్ష్మణ ఖిలా వద్ద బహిరంగసభలో ప్రసంగించనున్నారు. థాకరే పర్యటన కోసం ఇప్పటికే 4వేల మంది శివసేన కార్యకర్తలు అయోధ్యకు చేరుకున్నారు.
అయోధ్యలో రామమందిర నిర్మాణం వెంటనే చేపట్టాలంటూ గత కొన్ని రోజులుగా శివసేన డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం కూడా ఈ పార్టీ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు చేసింది. ‘బాబ్రీమసీదును నేల మట్టం చేసేందుకు రామభక్తులకు 17 నిమిషాలు మాత్రమే పట్టిందని, మందిర నిర్మాణం కోసం చట్టం చేసేందుకు ప్రభుత్వానికి ఎంత కాలం పడుతుంది?’’ అని శివసేన అధికార ప్రతినిధి సంజయ్‌రౌత్ ప్రశ్నించారు. భారీ మెజారిటీ ఉన్నా, మందిరాన్ని కట్టలేకపోయామని, 2019లో మళ్లీ అదే నినాదంతో ప్రజల వద్దకు వెళ్లడం తమ నేత ఉద్ధవ్‌కు ఆమోదనీయం కాదన్నారు. మందిర నిర్మాణానికి బిల్లు తెస్తే పార్టీలకు అతీతంగా 400 మంది ఎంపీలు మద్దతు ఇస్తారని వెల్లడించారు. రామ మందిరం నిర్మించే తేదీ చెప్పాలని శివసేన డిమాండ్ చేస్తోంది.