ఆర్ఆర్ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

పినపాక నియోజకవర్గం అక్టోబర్ 01( జనం సాక్షి): మణుగూరు మండలం సుందరయ్య నగర్ లో ఆర్ఆర్ యూత్ ఆధ్వర్యంలో చతుర్థి శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరవ రోజు మహాలక్ష్మి దేవిని కనకాంబరి పుష్పాలతో అలంకరించారు. ఈ లోకంలో సుమారు 84 లక్షల జీవరాశుల్లో ఒక్కొక్క జాతికి ఒక్కో ప్రత్యేక ఆహార విధానం పరమేశ్వరుని ద్వారా నిర్ణయించబడింది. పరమేశ్వరునికి పూజ చేసి ఉపవాసం చెయ్యాలి. అలా ఉపవాసం చేసి పరమేశ్వరునికి నైవేద్యం పెట్టడం ద్వారా ఆ నైవేద్యం సకల జీవరాశులకు చేరుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఎవరైనా ధనం, వస్తు, బంగారం దానం చేస్తే ఇంకా కావాలని ఆశిస్తాడు అదే అన్నాన్ని దానం చేస్తే కడుపు నిండిన తర్వాత ఇంకా కావాలని ఆశించలేడు అంతటితో తృప్తి చెంది అన్నదాతను అన్నదాత సుఖీభవ అని మనస్ఫూర్తిగా ఆశీర్వదించుతారు. ఆ ఆశీర్వాదమే అన్నదాతలకు ఆయు ఆరోగ్యం ఆర్థిక వృద్ధి సిద్ధిస్తుంది. అన్ని దానాలకంటే అన్నదానం గొప్ప దానమని ప్రదీప్ శాస్త్రి తెలిపారు. శనివారం రంగా శ్రీనివాస్ ఉదయశ్రీలు దంపతులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఆర్ యూత్ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నదాతలను ఆశీర్వదించారు.