ఆర్థిక నేరగాళ్లకు సకల భోగాలా

జైళ్లలో సకల సౌకర్యాలపై సుప్రీం ఆగ్రహం

జైళ్ల శాఖ తీరుపై మండిపాటు

నివేదిక ఇవ్వాలని కేంద్రానికి ఆదేశం

న్యూఢిల్లీనవంబర్‌22(జ‌నంసాక్షి): తీవ్రమైన నేరాలకు పాల్పడి జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు సకల సౌకర్యాలు అందుతుండడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. జైళ్లలో సమాంతర వ్యవస్థ

ఏమైనా నడుస్తోందా? అంటూ జైళ్ల శాఖను నిలదీసింది. గృహ కొనుగోలుదారులను మోసం చేసిన కేసులో న్యూఢిల్లీలోని తీహార్‌ జైల్లో ఊచలు లెక్కిస్తున్న యూనిటెక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంజయ్‌ చంద్ర, ఆయన సోదరుడు అజయ్‌ జైల్లో విలాసవంతమైన జీవితం గడుపుతున్నట్టు వస్తున్న వార్తలపై సుప్రీం విస్మయం వ్యక్తం చేసింది. ప్రతినిత్యం ఈ వ్యవహారంపై కథనాలు బయటికి వస్తూనే ఉన్నాయి. తమిళనాడు, బీహార్‌… ఇలా అనేక చోట్ల జైళ్లలో మొబైల్‌ ఫోన్లు వాడడం సహా జైలు నుంచే అన్ని వ్యవహారాలు నడిపిస్తున్నారు. అని కోర్టు వ్యాఖ్యానించింది. జైళ్లలో జరుగుతున్న అక్రమాలపై సుప్రీంకోర్టు అదనపు సెషన్స్‌ జడ్జి నివేదిక సిద్ధం చేసిన నేపథ్యంలోనే సర్వోన్నత న్యాయస్థానం ఈ మేరకు వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రత్యేకించి యూనిటెక్‌ ఎండీ, ఆయన సోదరుడికి జైల్లో ఎల్‌ఈడీ టీవీ, కొబ్బరినీళ్లు, మినరల్‌ వాటర్‌, బ్యాడ్మింటన్‌ రాకెట్లు సహా ఇతర నిషేధిత వస్తువులను సమకూర్చినట్టు వచ్చిన ఫిర్యాదులపై అదనపు సెషన్స్‌ జడ్జి విచారించారు. తీహార్‌ జైల్లో విూరు చేసింది ఏమిటి? వీళ్లు టీవీ చూసి ఆనందిస్తున్నారు. సోఫాల్లో కూర్చుంటున్నారు. ఇంకా వాళ్లకు ఏమేం అందుతున్నాయో భగవంతుడికే తెలియాలి… అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నదో చెప్పాలంటూ ఆదేశించింది. దీనిపై కేంద్ర తరపున అదనపు సోలిసిటర్‌ జనరల్‌ అమన్‌ లేఖి స్పందిస్తూ… వీటిని తీవ్రంగా పరిగణించాల్సి ఉందని… దీనికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సుప్రీంకు నివేదించారు.

మరోవైపు జైళ్లలో మగ్గుతున్న సాధారణ ఖైదీలకు కనీస ఏర్పాట్లు కూడా చేయకపోవడంపై సుప్రీం మండిపడింది. జైళ్ల నిర్వహణ మొత్తం ఓ జోక్‌లా మార్చేశారు. కొన్ని జైళ్లకు వెళ్లి అక్కడి ఖైదీలు ఎలాంటి పరిస్థితుల మధ్య బతుకుతున్నారో పరిశీలించండి. విూ అధికారులను ఓ సారి ఆఫీసుల నుంచి బయటికి వచ్చి ఒక్కసారి ఆ పరిస్థితులను చూడమనండి. కనీసం నీళ్ల ట్యాపులు పనిచేయవు. మురుగు నీళ్లు కూడా బయటికి పోయే సౌకర్యం లేదని సుప్రీంకోర్టు కేంద్రాన్ని నిలదీసింది.