ఆశావర్కర్లకు పెంచిన జీతాలను ఇవ్వాలి

వైద్యారోగ్యశాఖ కార్యాలయాన్ని ముట్టడించిన మహిళలు

విజయనగరం,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఆశా వర్కర్ల జీతాల రేట్లను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ.. ఎపి వాలంటరీ హెల్త్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఆశా వర్కర్స్‌) ఆధ్వర్యంలో విజయనగరం డిఎంహెచ్‌ఒ (జిల్లా వైద్య ఆరోగ్య శాఖ) కార్యాలయాన్ని గురువారం ముట్టడించారు. ఈ సందర్భంగా యూనియన్‌ జిల్లా అధ్యక్షులు బి.సుధారాణి మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆశా వర్కర్ల పారితోషకాల తగ్గింపును విరమించాలని, మొదట ప్రకటించిన విధంగా నెలకు రూ. 8,600 పారితోషకం రేట్లను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ఆశా వర్కర్లకు గౌరవ వేతనం ప్రకటించిన తరవాత.. పారితోషకాల చెల్లింపులపై నెలకి ఒక్కో పద్ధతిలో చెల్లించి ఆశాలను గందరగోళ పరుస్తున్నారన్నారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఆశా వర్కర్లకు జీతాలు ఇవ్వకపోవడంపై ఆశా వర్కర్లు తీవ్ర నిరాశకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అనేక మంది గౌరవ వేతనాలు, వివిధ సంక్షేమ పథకాలకి చెల్లిస్తున్న డబ్బులను పెంచిన నేపథ్యంలో.. ఆశా వర్కర్ల విషయంలో మాత్రం ఆలోచించకపోవడం దారుణమని దుయ్యబట్టారు. పెరిగిన నిత్యావసరాలు, ధరల దృష్ట్యా.. ఆశా వర్కర్ల

సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ ఈ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించామని సుధారాణి పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ప్రకటించిన 8600 రూపాయలు వేతనాలు చెల్లించాలని, అర్హత ఉన్న ఆశాలకు ఎఎన్‌ఎం లుగా ప్రమోషన్‌ లు ఇవ్వాలని చెప్పారు. మహిళల డెలివరీలను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తేవడంతో ప్రైవేటు ఆసుపత్రికి వెళుతున్నారని చెప్పారు. వీరికి సర్వీస్‌ చేసిన డబ్బులు ఆశా వర్కర్లుకి చెల్లించడం లేదని, ఆ బకాయిలు వెంటనే చెల్లించాలని, ఆశా వర్కర్లు కి పెండింగ్‌లో ఉన్న అన్ని రకాల బకాయిలని వెంటనే ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా మరో సారి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వెంటనే డిఎంహెచ్‌ఒ బయటకి రావాలని ఆశా వర్కర్లంతా నినాదాలు చేశారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయానికి పోలీసులు భారీగా చేరుకున్నారు. ముట్టడి ఉధృతం అయితే అరెస్ట్‌ చేయడానికి సన్నద్ధం అవుతున్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి టివి.రమణ, ఆశా వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి పిఎస్‌వి.రత్నం, మహిళ కన్వీనర్‌ ఇందిరా, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఎన్‌వై.నాయుడు, అధిక సంఖ్యలో జిల్లా నలు మూలల నుండి ఆశా వర్కర్లు పాల్గొన్నారు.