ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని మానవహారం

ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని మానవహారం

జనం సాక్షి ప్రతినిధి మెదక్ ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈరోజు మెదక్ పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ చౌరస్తా నుంచి ర్యాలీగా వెళ్లి రాందాస్ చౌరస్తా వద్ద ఆశా వర్కర్లు మానవహారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు మెదక్ జిల్లా ఉపాధ్యక్షులు ఏ మల్లేశం గారు మాట్లాడుతూ….
ఆశా వర్కర్లలకు పారితోషికాలు కాకుండా, ఫిక్స్డ్ జీతం నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనేక సంవత్సరాలుగా పోరాడుతున్నా.. రాష్ట్ర ప్రభుత్వం ఫిక్స్డ్ జీతం ఇవ్వకుండా పారితోషికాలు కేవలం రూ. 9,750/-లు మాత్రమే కొద్దిమందికే పనిని బట్టి ఇస్తూ, ఆశాలతో బండెడు చాకిరి చేయించుకుంటుందని వారు అన్నారు. నిత్యవసర వస్తువుల ధరలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యం లో వచ్చే పారితోషికాలు సరిపోక ఆశా వర్కర్లు ఆర్థిక ఇబ్బందులకు గురౌతున్నారన్నారు. కావున ఆశాలకు పారితోషికాలను రూ.18,000/- లకు పెంచి ఫిక్సిడ్ వేతనం నిర్ణయించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఆశాలకు పి.ఎఫ్, ఇ.ఎస్.ఐ సౌకర్యం, ఉద్యోగ భద్రత, హెల్త్ కార్డులు,ప్రమాద బీమా సౌకర్యం రూ. 5 లక్షలు, మరియు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.5 లక్షలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటినీ విరికి వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. ఏఎన్ఎం, జిఎన్ఎం పోస్టుల్లో ఆశాలకు ప్రమోషన్ సౌకర్యం, వెయిటేజీ మార్కులు నిర్ణయం చేయాలని,మట్టి ఖర్చులు రూ.50,000/-లు చెల్లించాలని, పారితోషికం లేని అదనపు పనులు ఆశాలతో చేయించకూడదని, టిబి, స్పూటమ్ డబ్బాలను ఆశాలతో మోపించే పనిని రద్దు చేయాలని, టి.బి. లెప్రసీ, కంటి వెలుగు తదితర పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని, లెప్రసీ సర్వేలో వస్తున్న ఇబ్బందులను పరిష్కరించాలని,వాలంటీర్లను ఏర్పాటు చేయాలని, వీరికి పని భారం తగ్గించి,జాబ్ చార్ట్ను విడుదల చేయాలన్నారు. 2021 జూలై నుండి డిసెంబర్ వరకు 6 నెలల పిఆర్సి ఎరియర్స్ వెంటనే చెల్లించాలని, కేంద్రం చెల్లించిన కరోనా రిస్క్ అలవెన్స్ నెలకు వెయ్యి చొప్పున 16 నెలల బకాయి డబ్బులు వెంటనే చెల్లించాలని, 32 రకాల రిజిష్టర్స్ను వెంటనే ప్రింట్ చేసి ప్రభుత్వం సప్లై చేయాలని, క్వాలిటీతో కూడిన 5 స.రాల పెండింగ్ యూనిఫామ్స్ వెంటనే ఇవ్వాలని, ప్రసూతి సెలవుల పైన సర్క్యులర్ను వెంటనే జారీ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం సమస్యలు తక్షణమే పరిష్కారం చేయాలన్నారు. లేనియెడల సమ్మెను ఉధృతం చేస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్ల యూనియన్ జిల్లా కార్యదర్శి సావిత్రి, నాయకులు స్వప్న, రాణి, పద్మ మరియు ఆశ వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.