ఆహారధాన్యాలు రికార్డుస్థాయిలో ఉత్పత్తి

– తమిళనాడు రైతులను ప్రశంసించి మోదీ

చెన్నై,ఫిబ్రవరి 14(జనంసాక్షి):తమిళనాడు రైతులు రికార్డు స్థాయిలో ఆహారధాన్యాల్ని ఉత్పత్తి చేస్తున్నారని భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో భాగంగా ఆదివారం ఆయన తమిళనాడుకు విచ్చేశారు. చెన్నైలోని జవహార్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో మోదీ.. రెండేళ్ల క్రితం ఇదే రోజున పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు నివాళులర్పించారు. అనంతరం ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ పథకం కింద చెన్నై నగరంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను మోదీ ప్రారంభించారు. చెన్నైలో రూ.3,770 కోట్లతో చేపట్టిన మెట్రో రైల్‌ ఫేజ్‌-1 ప్రాజెక్టును మోదీ ప్రారంభించారు. ఈ మెట్రో కారిడార్‌ నార్త్‌ చెన్నై నుంచి విమానాశ్రయాన్ని, సెంట్రల్‌ రైల్వే స్టేషన్‌ను కలుపుతూ 9కిలోవిూటర్ల మేర నిర్మించారు. దాంతో పాటు రూ.293 కోట్లతో చెన్నై బీచ్‌, అట్టిపట్టు ప్రాంతాల మధ్య రైల్వే లైన్‌ను ప్రారంభించారు. అదేవిధంగా చెన్నైలోని తైయూర్‌ సవిూపంలో రూ.1000 కోట్ల అంచనాతో నిర్మించనున్న ఐఐటీ మద్రాస్‌కు చెందిన డిస్కవరీ క్యాంపస్‌కు శంకుస్థాపన చేశారు.

రికార్డు స్థాయిలో పంట ఉత్పత్తులు

‘చెన్నై ఎంతో శక్తిమంతమైన నగరం. ఈ నగరం జ్ఞానం, సృజనాత్మకతకు నిలయం. ఇక్కడ మనం ప్రారంభించిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు మన స్వదేశీ అభివృద్ధికి చిహ్నాలు. దేశీయంగా అభివృద్ధి చేసిన అర్జున్‌ యుద్ధ ట్యాంక్‌ను దేశానికి అంకితం చేయడం ఎంతో గర్వంగా ఉంది. తమిళనాడు ఇప్పటికే దేశంలో ఆటోమొబైల్‌ హబ్‌గా నిలిచింది. ఇప్పుడు నేను ఈ రాష్ట్రాన్ని యుద్ధ ట్యాంకుల తయారీకి కేంద్రంగా చూస్తున్నా. దేశంలోనే అత్యధికంగా రికార్డు స్థాయిలో తమిళనాడు రైతులు ఆహారధాన్యాలను ఉత్పత్తి చేస్తున్నారు. నీరు ఇతర వనరుల్ని ఇక్కడి రైతులు చక్కగా ఉపయోగించుకుంటున్నారు. ‘పర్‌ డ్రాప్‌.. మోర్‌ క్రాప్‌’ అనే నినాదాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి’ అని మోదీ తమిళనాడు రైతుల కృషిని కొనియాడారు.

అమరుల త్యాగాలు మరువలేనివి

రెండేళ్ల క్రితం ఇదేరోజున చోటుచేసుకున్న పుల్వామా ఉగ్రదాడి గురించి ప్రస్తావిస్తూ..’ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు నివాళులు. పుల్వామాలో ఉగ్రదాడి జరిగిన ఈ రోజును భారతీయులెవరూ మరచిపోలేరు. మన భద్రతా దళాలను చూసి దేశం గర్విస్తోంది. వారి త్యాగాలు దేశ ప్రజలకు ఆదర్శం’ అంటూ మోదీ సైనికుల త్యాగాలను గుర్తుచేసుకున్నారు. ‘ప్రస్తుతం ప్రపంచం మొత్తం మనవైపు చూస్తోంది. ఈ దశాబ్దం భారత్‌దే. దేశంలో సంస్కరణలకు కట్టుబడి ఉన్నామనే విషయానికి ఇటీవల పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెటే నిదర్శనం. మత్స్యకార సమాజాన్ని చూసి గర్విస్తున్నాం. తమిళనాడులో ఐదు ఫిషింగ్‌ హార్బర్‌లు త్వరలో ఏర్పాటు కానున్నాయి. శ్రీలంకలో ఉన్న తమిళ సోదరులు, సోదరీమణుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది. మత్స్యకారుల ప్రయోజనాలకు మా ప్రభుత్వం ఎప్పుడూ అనుకూలమే’ అని మోదీ వెల్లడించారు.