ఆ పాదముద్రలు ఎలుగుబంటివి!!

– ‘యతి’ పాదముద్రలు కాదు
– వెల్లడించిన నేపాల్‌ సైన్యం
న్యూఢిల్లీ, మే3(జ‌నంసాక్షి) : హిమాలయాల్లో యతి అడుగులు కనిపించాయని భారత సైన్యం పేర్కొన్న వార్తలను నేపాల్‌ సైన్యం ఖండించింది. అవి యతివి కాదని.. ఎలుగుబంటి పాదముద్రలని పేర్కొంది. గత మూడురోజుల క్రితం మకాలులో తమకు మిస్టరీ మంచుమనిషి యతి పాదముద్రలు కనిపించాయని భారత సైన్యం చేసిన ప్రకటన చేసిన విషయం విధితమే. కాగా నేపాల్‌ సైన్యం మాత్రం వాటిని కొట్టిపారేస్తుంది.  మంచుపై కనిపిస్తున్న భారీ పాదముద్రలు యతివి కావు, ఎలుగుబంటి అడుగుజాడలని నేపాల్‌ సైన్యం చెబుతోంది. భారత సైన్యం తమ పర్వతారోహక బృందానికి ఏప్రిల్‌ 9న మకాలు బేస్‌ క్యాంప్‌ దగ్గర భారీ శరీరం ఉండే జీవి పదచిహ్నాలు కనిపించాయని గత మంగళవారం ప్రకటించింది. ఈ గుర్తులు రహస్యమయ మంచుమనిషి యతి పాదాలవే అవుతాయని సైన్యం తెలిపింది. పాదాల ఆకారం 32 అంగుళాల పొడవు, 15 అంగుళాల వెడల్పు ఉన్నట్టు చెప్పింది. సైన్యం తమ ట్విట్టర్‌ హ్యాండిల్‌ లో ఈ పాదముద్రల ఫోటోలు,
వీడియోలను షేర్‌ చేసింది. భారత సైన్యం ప్రకటనలను నేపాల్‌ సైన్యం ప్రతినిధి బ్రిగేడియర్‌ జనరల్‌ బిజ్ఞాన్‌ దేవ్‌ పాండేయ్‌ అంగీకరించలేదు. భారత సైన్యానికి చెందిన ఏ బృందం ఈ కాలి గుర్తులు చూసిందో వారితో పాటు నేపాల్‌ సైన్యానికి చెందిన లైజన్‌ అధికారి, ఒక స్థానిక పోర్టర్‌ కూడా ఉన్నారని.. వాళ్లిద్దరూ ఈ పాదముద్రలు మంచుమనిషివి కావు..ఎలుగుబంటివని చెప్పారని అన్నారు. ఆ ప్రాంతంలో తరచుగా ఇలాంటి గుర్తులు కనిపిస్తుంటాయని, ఎందుకంటే అక్కడ మంచు ఎలుగుబంట్లు నివసిస్తాయని తెలిపింది.  నేపాల్‌ సరిహద్దుల్లో ఉండే మకాలు ప్రాంతంలో నివసించే గ్రావిూణ ప్రజలు ఎన్నోసార్లు మంచుపై ఇలాంటి అడుగుజాడలు చూసినట్టు జనరల్‌ బిజ్ఞాన్‌ దేవ్‌ తెలిపారు.