ఇంద్రకీలాద్రిపై కొనసాగుతున్న రద్దీ

ఘనంగా ముగిసిన తెప్పోత్సవం
విజయవాడ,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): దసరా ఉత్సవాలు ముగిసినా ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. రద్దీ దృష్ట్యా వినాయక ఆలయం నుంచి క్యూలైన్లను ఏర్పాటు చేశారు. విజయదశమి గడియలు ఉండటంతో అమ్మవారికి రాజరాజేశ్వరీదేవి అలంకారాన్ని కొనసాగిస్తున్నారు. సాధారణ భక్తులతో పాటు పెద్ద ఎత్తున భవానీ దీక్షాపరులు ఇంద్రకీలాద్రికి చేరుకుంటున్నారు. భక్తులు ఘాట్లలో పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తులు భారీగా తరలి వస్తుండటంతో ¬మగుండం, లడ్డూ ప్రసాద కేంద్రాల వద్ద రద్దీ నెలకొంది.  దసరా ఉత్సవాల్లో భాగంగా కృష్ణా నదిలో తెప్పోత్సవం కన్నుల పండువగా జరిగింది. విద్యుద్దీపాలతో అందంగా అలంకరించిన హంస వాహనంలో దుర్గా మల్లేశ్వర స్వామివార్లు నదిలో విహరించారు. సుమారు 2 గంటల పాటు జరిగిన ఈ వేడుకను కనులారా వీక్షించేందుకు పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. భవానీలు సహా భక్తులతో ప్రకాశం బ్యారేజీ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. రద్దీ దృష్ట్యా బ్యారేజీ పరిసరాల్లో ముందస్తుగా వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ప్రకాశం బ్యారేజీ ఎగువన కృష్ణానదిలో హంస వాహనంపై తిరిగే ఉత్సవ మూర్తులను వీక్షించారు. ఈ వేడుక దృశ్యాలను చాలామంది భక్తులు తమ సెల్‌ఫోన్లలో బంధించారు. అంతకు ముందు ఇంద్రకీలాద్రి పైనుంచి ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా దుర్గాఘాట్‌కు తీసుకువచ్చారు. ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో దుర్గామల్లేశ్వరస్వామి వార్లు కృష్ణమ్మ చెంతకు చేరారు. దసరా ఉత్సవాల్లో కీలకఘట్టమైన తెప్పోత్సవం వైభవంగా నిర్వహిచడంపై భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.

తాజావార్తలు