ఇంద్రకీలాద్రిపై వైభవంగా శరన్నవరాత్రులు
అన్నపూర్ణగా కనకదుర్గమ్మ అభయం
విజయవాడ,అక్టోబర్15(జనంసాక్షి): ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ఆరో రోజైన సోమవారం కనకదుర్గ అమ్మవారు అన్నపూర్ణ దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. సకల జీవరాశికి ఆహారం ప్రసాదించే అన్నపూర్ణ దేవి అలంకారాన్ని చూసేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఓ చేతిలో అక్షయపాత్ర, మరో చేతిలో గరిట పట్టుకుని ప్రజల ఆకలి దప్పులను తీర్చే తల్లిగా అన్నపూర్ణ దేవి రూపం భక్తుల్లో పారవశ్యాన్ని నింపుతోంది. ఆదివారం మూల నక్షత్రం కావడంతో సరస్వతి దేవి అలంకరణలో ఉన్న దుర్గమ్మను సుమారు మూడున్నర లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. సోమవారం మాత్రం భక్తుల రద్దీ కాస్త తగ్గింది. కొండపై ఉన్న క్యూలైన్లలో మాత్రమే భక్తులు కనిపిస్తున్నారు. రద్దీ తగ్గినా పోలీసుల ఆంక్షలు సడలించకపోవంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. పోలీస్ కంట్రోల్ రూమ్, పండిట్ నెహ్రూ బస్టాండ్, భవానీపురం వద్దే వాహనాలు నిలిపివేస్తున్నారు. దీంతో ఆలయానికి వెళ్తే భక్తులు సుమారు రెండు కిలోవిూటర్లు నడవాల్సి వస్తోంది. రద్దీ లేకపోయినా ఆంక్షలు విధించడంపై భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుంటు దసరా ఉత్సవాల్లో ఇప్పటి వరకు ఇంద్రకీలాద్రి అమ్మవారిని 9.40 లక్షల మంది దర్శించుకున్నారని దుర్గ గుడి ఈవో కోటేశ్వరమ్మ తెలిపారు. మూలా నక్షత్రం రోజున అమ్మవారిని 4.15 లక్షల మంది దర్శించుకున్నారని తెలిపారు. మూలానక్షత్రం నాడు 97 వేల మందికి అన్నదానం, 4.70 లక్షల మందికి కుంకుమ ప్రసాదం, 30 వేల మందికి వైద్య సదుపాయం అందించామని తెలిపారు. భవానీ దీక్షాదారుల కోసం దుర్గాష్టమి నాడు ¬మ గుండాలను ప్రారంభిస్తున్నామన్నారు. భవానీలు తీసుకువచ్చే నేతి కొబ్బరికాయలను ఇకపై చండీ ¬మంలో వాడాలని వైదిక కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు ఈవో కోటేశ్వరమ్మ పేర్కొన్నారు.
అమ్మవారి సేవలో చింతమనేని
దెందులూరు ఎమ్మెల్యే, విప్ చింతమనేని ప్రభాకర్ సోమవారం విజయవాడ అమ్మవారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చిన ఆయన అమ్మవారి దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వేదాశీర్వచనాలు అందించారు.అనంతరం చింతమనేని మాట్లాడుతూ కనకదుర్గమ్మ రాష్ట్ర ప్రజలను సుఖసంతోషాలతో ఆశీర్వదించాలని కోరినట్లు తెలిపారు.
అమ్మవారి సన్నిధిలో భక్తుడి మృతి
శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారి దర్శనానికి వచ్చి ఓ భక్తుడు అమ్మవారి సన్నిధిలోనే ప్రాణాలు విడిచాడు. దుర్గగుడి ఆవరణలో గత అర్ధరాత్రి ఓ భక్తుడు గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడు కృష్ణలంకకు చెందిన అనిల్‌గా గుర్తించారు. వెంటనే ఆలయ అధికారులు పోలీసుల సహాయంతో మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించి కుటుంబసభ్యులకు సమాచారం అందజేశారు.