ఇంద్రకీలాద్రిపై వైభవంగా శరన్నవరాత్రి
గాయత్రీదేవి అవతారంలో దర్శనమిచ్చిన దుర్గమ్మ
భారీగా తరలి వచ్చిన భక్త జనం
అమ్మవారిని దర్శించుకున్న మంత్రి కన్నబాబు
విజయవాడ,అక్టోబర్9 (జనంసాక్షి): ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. అంగరంగ వైభవంగా అమ్మవారి అవతారాలను సాగిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా మూడవరోజు శనివారం సకల మంత్రాలకు మూలమైన గాయత్రిదేవిగా అమ్మవారు భక్తులకు దర్శన మిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము 4 గంటల నుంచే భక్తులు భారీగా తరలి వచ్చారు. అమ్మవారు వేదమాతగా ప్రసిద్ధి పొందిన ముక్తా, విద్రుమ, హేమ నీల, దవళ వర్ణాలతో ప్రకాశించే పంచ ముఖాలతో గాయత్రీదేవి దివ్యమంగళ రూపంగా దర్శనమిస్తున్నారు. భక్తులు గాయత్రీదేవి శిరస్సులో
బ్రహ్మ, విష్ణువు, శిఖలో రుద్రుడు నివసిస్తారని పురాణాలు చెబుతున్నాయి. కర్మసాక్షి సూర్యభగవానుడు గాయత్రీ మంత్రానికి అధిష్ఠాన దేవతగా భాసిల్లుతున్నాడు. గాయత్రీమాతను దర్శించుకోవడం వల్ల సకల మంత్ర సిద్ధి ఫలాన్ని పొందుతారని భక్తుల విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. గాయత్రీదేవి అలంకారంలో దర్శనం ఇచ్చిన అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. దర్శనానంతరం ఆయన విూడియాతో మాట్లాడుతూ.. కరోనా పూర్తిగా తగ్గాలని, తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనాలని అమ్మవారిని ప్రార్ధించానన్నారు. రైతాంగంపై అమ్మవారి దయ ఉండాలని వేడుకున్నాన న్నారు. దసరా ఉత్సవ ఏర్పాట్లు బాగున్నాయన్నారు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ దసరా ఉత్సవాల ఏర్పాట్లు బాగా చేశారని కొనియాడారు. వేలాదిమంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి తరలివస్తున్నారన్నారు. భక్తులు కరోనా నిబంధనలు పాటించాలన్నారు. తొలిసారిగా 70 కోట్ల రూపాయలు గుడి అభివృద్ధికి కేటాయించిన ఘనత సీఎం జగన్‌కు దక్కుతుందన్నారు. దుర్గగుడి సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని కన్నబాబు పేర్కొన్నారు.