ఇవివెంకు మంత్రి పూజలు

 

విచారణకు ఆదేశించిన ఇసి

రాయ్‌పుర్‌,నవంబర్‌22(జ‌నంసాక్షి): ఛత్తీస్‌గఢ్‌లో సహకార శాఖ మంత్రి, నవాగఢ్‌ భాజపా అభ్యర్థి దయాళ్‌దాస్‌ బఘేల్‌ ఎటిఎంకు పూజలు చేస్తున్న ఫొటో ఒకటి సోషల్‌విూడియాలో హల్‌ చల్‌ చేస్తోంది. రెండోదశ పోలింగ్‌ జరిగిన మంగళవారం ఉదయాన ఆయన పోలింగ్‌ కేంద్రానికి చేరుకుని, అగరవత్తుల ధూపాన్ని ఈవిఎంకు చూపుతూ పూజలు చేశారు. అనంతరం కొబ్బరికాయను కొట్టారు. ఇదంతా అక్కడున్న కొందరు కెమెరాల్లో బంధిస్తున్నప్పటికీ మంత్రి యథేచ్ఛగా పూజలు చేశారు. దీంతో ఈవిఎంకు పూజల విషయమై 24 గంటల్లో వివరణ ఇవ్వాలని దయాళ్‌దాస్‌ను నవాగఢ్‌ రిటర్నింగ్‌ అధికారి కోరారని బెమెటెరా జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి మహదేవ్‌ విలేకరులకు తెలిపారు. వీడియోలోని దృశ్యాల్లో పోలింగ్‌ కేంద్రం సంఖ్య కనిపించ లేదని, ఏ కేంద్రంలో జరిగిందో తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని వివరించారు. ఈ విషయమై ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ భాజపాపై తీవ్రస్థాయిలో మండిపడింది. ప్రజాస్వామ్యంలో నేతలు ఓటర్లను ప్రార్థించాలి. ఈవిఎంలను కాదు అని అన్నారు. బిజెపి 15 ఏళ్లుగా ప్రజలను పట్టించుకోకుండా పోలింగ్‌ తేదీ నాడు ఈవిఎంలకు పూజలు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు అని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి శైలేష్‌ నితిన్‌ త్రివేది వ్యాఖ్యానించారు.