ఇసుక అక్రమాలకు అడ్డుకట్ట వేయాలి
సామాన్యులకు అందుబాటులో లేదంటున్న ప్రజలు
ఏలూరు,అక్టోబర్29(జనంసాక్షి): ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని ప్రకటించినా దీనికి
పూర్తిస్థాయిలో విధివిధానాలు ప్రకటించకపోవడం వల్ల ర్యాంపులోకి వెళ్లి ఇసుక తెచ్చుకోలేక పోతున్నారు. లబ్ధిదారులు ఇసుక అవసరాలను ఆసరాగా చేసుకుని లారీల్లోనూ, ట్రాక్టర్లలోనూ, రోడ్లు, పోరంబోకు, పంట
కాలువలు, ఖాళీ ప్రదేశాల్లో వేసిన ఇసుకను అక్రమంగా అధిక ధరలకు అమ్ముకుని తమ జేబులు నింపుకుంటున్నారు. దీంతో లబ్దిదారులకు ఉచిత ఇసుక అందక అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు ర్యాంపుల నిర్వహణ అక్రమార్కుల చేతుల్లోనే
ఉండిపోయాయి. అందుకే అధికార పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు ఉచిత ఇసుక విధానాన్ని తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన ఉచిత ఇసుక విధానం కొందరు అక్రమార్కులకు వరంగా మారింది. ఉచిత ఇసుక విధానం అక్రమదారులకు భారీగా కాసులు కురిపిస్తున్నాయి. గోదావరి నుంచి ఇసుకను ఉచిత ముసుగులో అక్రమంగా తరలించి రహస్య ప్రాంతాల్లో నిల్వ చేసి ప్రస్తుతం అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వం సదుద్దేశ్యంతో నూతన విధానం అమల్లోకి తీసుకుని వచ్చినా పేదవాడికి ఉచితంగా ఇసుక అందడం లేదు. ఎన్‌టిఆర్ గృహ నిర్మాణ పథకంలో ఇళ్లు మంజూరయ్యాయి. ఈ పనులను లబ్ధిదారులు ఇప్పటికే చేపట్టారు. మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి సుమారు ఏడు వేల వరకూ ఇళ్లు మంజూరయ్యాయి. ఇవి కూడా వివిధ దశల్లో ఉన్నాయి. దీంతో ఇసుకకు డిమాండ్ పెరగడంతో అడ్డూఅదుపు లేకుండా అమ్మకాలు సాగిస్తున్నారు. ఇకపోతే అక్రమాలను నిరోధించడంలో రెవెన్యూ, పోలీసు సిబ్బంది పూర్తిగా విఫల మయ్యారు. ఈ విషయాన్ని రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా అక్రమ ఇసుక దాఖలాలు లేవని సమాధానం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా పోలీసు, రెవెన్యూ, మైనింగ్ అధికారులు చొరవ చూపి లబ్ధిదారులకు ఇసుక అందే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.