ఈవీఎంలపై పిటిషన్‌ను.. తిరస్కరించిన సుప్రీంకోర్టు

 

న్యూఢిల్లీ, నవంబర్‌22(జ‌నంసాక్షి) : ఎలక్టాన్రిక్‌ ఓటింగ్‌ యంత్రాలు (ఈవీఎంలు) శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో వినియోగించకుండా, బ్యాలెట్‌ పత్రాలు వినియోగించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ వచ్చిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం తిరస్కరించింది. ఎన్నికల్లో ఈవీఎంలను వినియోగిస్తే అవి దుర్వినియోగానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయని, ఎటువంటి అవకతవకలు జరగకుండా ఉండాలంటే వాటిని వాడకపోవడమే మంచిదంటూ ‘న్యాయ్‌ భూమి’ అనే ఎన్జీవో పేర్కొన్నారు. అయితే ఈ అంశంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌తో కూడిన ధర్మాసనం ఏకీభవించలేదు. ‘ప్రతి వ్యవస్థ లేదా యంత్రాన్ని సమర్థంగా వినియోగించవచ్చు లేదా దుర్వినియోగపర్చవచ్చునని, అనుమానాలు ప్రతి చోటా ఉంటాయని పేర్కొంది. ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోనూ ఈవీఎంలనే వినియోగిస్తున్నారు. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లోనూ వీటిని వాడతారు. అయితే, వాటిని ట్యాంపరింగ్‌ చేసే అవకాశం ఉందని దేశంలోని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. కానీ, వాటిని ఎలా దుర్వినియోగపర్చవచ్చన్న విషయాన్ని మాత్రం రుజువు చేయలేకపోతున్నాయి. ఈవీఎంలను దుర్వినియోగ పర్చినా, సరిగ్గా వినియోగించినా ప్రజల్లో మాత్రం వాటిపై అనుమానం ఉందని, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది సరికాదని, దీని కోసమైనా బ్యాలెట్‌ పద్ధతి ప్రకారమే ఎన్నికలు జరపాలని కూడా ప్రతిపక్ష పార్టీల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.