ఈసీ పనితీరుపై సందేహాలొద్దు

– దరఖాస్తులను పరిశీలించాకే ఓట్ల తొలగింపు
– ఓట్ల తొలగింపుపై విమర్శలు చేసేవారు నిరూపించాలి
– ఈసీ దురుద్దేశాలు ఆపాదించడం సరికాదు
– ప్రధాన ఎన్నికల అధికారి జీకే ద్వివేది
అమరావతి, మార్చి5(జ‌నంసాక్షి) : ఎన్నికల సంఘం పనితీరు విూద సందేహాలు వద్దని, ప్రతి దరఖాస్తునూ పరిశీలించాకే ఓట్ల తొలగింపు ఉంటుందని ప్రధాన ఎన్నికల అధికారి జీకే ద్వివేది స్పష్టం చేశారు. మంగళవారం అమరావతిలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. మోసపూరితంగా ఓట్ల తొలగింపునకు ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోమన్నారు. ఏకపక్షంగా ఎక్కడ ఓట్లు తొలగించామో విమర్శించే వారు నిరూపించాలన్నారు. రాజకీయ విమర్శలతో తమకు సంబంధం లేదని.. ఎన్నికల సంఘానికి దురుద్దేశాలు ఆపాదించడం సరికాదని అన్నారు. మా సిబ్బంది తప్పు చేస్తే సస్పెండ్‌ అవుతారని అన్నారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తామని, నిబంధనల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.
ఓట్ల తొలగింపునకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా వందకుపైగా కేసులు నమోదయ్యాయని ద్వివేది చెప్పారు. ఐతే ఫారం-7 దరఖాస్తులు గణనీయంగా తగ్గిపోయాయని, వారంక్రితం వరకు రోజుకు వేలల్లో.. వారానికి లక్షల్లో వచ్చేవని.. ఇప్పుడు 300 కూడా రావడం లేదన్నారు. ఐటీ గ్రిడ్స్‌ వ్యవహారంలో ఓటర్ల జాబితా ఎక్కడ నుంచి వచ్చిందో సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ చెప్పాలని ద్వివేది పేర్కొన్నారు. డేటా ఎక్కడ నుంచి వచ్చిందో తేల్చాల్సింది పోలీసులేనన్నారు. ఎడిట్‌ చేయలేని ఓటర్ల జాబితాను మాత్రమే ఎన్నికల సంఘం విడుదల చేసిందని ఆయన చెప్పారు.