ఉచితబియ్యం పథకం సరికాదు

రాష్ట్రప్రభుత్వానికి హైకోర్టు అక్షింతలు

చెన్నై,నవంబర్‌23(జ‌నంసాక్షి): తమిళనాడు అమలు చేస్తున్న ఉచిత బియ్యం పథకాన్ని మద్రాస్‌ హైకోర్టు తీవ్రంగా విమర్శించింది. అలాంటి పథకాల వల్ల ప్రజలు బద్ధకస్తులుగా మారుతున్నారని చురకలు వేసింది. ఉచిత పథకాల కారణంగా ఎవరూ కూలికి వెళ్లడం లేదని, ఉత్తరాది నుంచి మనుషులను రప్పించాల్సి వస్తున్నదని కోర్టు విచారం వ్యక్తంచేసింది. నిరుపేద, వెనుకబడిన వర్గాలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేయడానికి తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేసింది. ఆర్థిక స్థితిగతులతో ప్రమేయం లేకుండా గుండుగుత్తగా అందరికీ ఉచితంగా బియ్యం అందించడం మాత్రం సరికాదని కోర్టు పేర్కొన్నది. సబ్సిడీ బియ్యం అక్రమరవాణా కేసులో అరెస్టయిన ఓ నిందితుడు దాఖలు చేసిన వ్యాజ్యం విచారణ సందర్భంగా శుక్రవారం హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. న్యాయమూర్తులు ఎన్‌ కిరుబాకరన్‌, అబ్దుల్‌ ఖద్దూస్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసు విచారిస్తున్నది. 2017-18 సంవత్సరంలో ఉచిత బియ్యం పథకానికి రూ.2110 కోట్లు ఖర్చు చేసినట్టు తమ దృష్టికి వచ్చిందని, ఇది చాలాపెద్దమొత్తం కనుక సబబైన రీతిలో మౌలిక వసతుల కల్పన వంటి పనులకు ఈనిని ఉపయోగించాల్సి ఉందని ధర్మాసనం తెలిపింది. పేదలు కాకుండా ఇతరులు లబ్ది పొందితే అనవసరంగా ప్రజాధనాన్ని ఇతరులకు కట్టబెట్టినట్టు అవుతుందని అభిప్రాయపడింది. దారిద్యర్రేఖకు దిగువన ఉన్నవారికి మాత్రమే ఉచిత బియ్యం పంపిణీ చేయాలని నొక్కిచెప్పింది.