ఉత్తరాఖండ్‌లో లింగ నిష్పత్తిలో తేడా

వేయిమంది మగపిల్లలకు 840మంది ఆడపిల్లలు
న్యూఢల్లీి,జూన్‌7(జనం సాక్షి):దైవ భూమిగా కొలిచే ఉత్తరాఖండ్‌లో లింగ నిష్పత్తిలో వెనకబడి ఉంది. నీతి అయోగ్‌ విడుదల చేసిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల ఎస్‌డిజి సూచీల నివేదికలో ఈ విషయం తేటతెల్లమైంది. దేశ సగటు లింగ నిష్పత్తి 899తో పోలిస్తే రాష్ట్ర నిష్పత్తి 840గా ఉంది. అంటే కేవలం ప్రతి వెయ్యి మంది మగపిల్లలకు కేవలం 840 మంది ఆడపిల్లలు మాత్రమే జన్మిస్తున్నారు. ఇందులో మెరుగైన పనితీరుతో చత్తీస్‌గఢ్‌ ముందంజలో ఉంది. అక్కడ ఆడ`మగ పుట్టుక నిష్పత్తి(958)… జాతీయ సగటు కన్నా అధికంగా ఉండటం విశేషం. చత్తీస్‌గఢ్‌ తర్వాత సుస్థిరాభివృద్ధిలో తొలి స్థానాన్ని కైవసం చేసుకున్న కేరళ నిలిచింది. ఇక్కడ లింగ నిష్పత్తి 957గా ఉంది. గతంలో లింగ నిష్పత్తిలో వెనుకబడ్డ పంజాబ్‌, హర్యానా వంటి రాష్టాల్రు మెరుగుపడ్డాయి. హర్యానాలో ప్రతి వెయ్యి మంది మగ పిల్లలకు గానూ 843 మంది ఆడ పిల్లలు జన్మిస్తుండగా… పంజాబ్‌లో ఆ సంఖ్య 890గా ఉంది. ఇటీవల నీతి అయోగ్‌ విడుదల చేసిన ఎస్‌డిజి సూచికలో 75 పాయింట్లతో కేరళ తొలి స్థానంలో నిలువగా, బీహార్‌ 52 పాయింట్లతో అతి పేలవమైన ప్రదర్శన కనబర్చిన సంగతి విదితమే. కాగా, దేశం మొత్తంగా ఎస్‌జిడి పరంగా ఆరు పాయింట్లు మెరుగుపడ్డప్పటికీ… ప్రపంచ కోణంలో భారత్‌ 115వ స్థానానికి పడిపోయింది. ఎస్‌డిజి అనేది పర్యావరణం, ఆరోగ్యం, శ్రేయస్సు, లింగ సమానత్వం, పారిశుధ్ధ్యం, ఇతర అంశాల పురోగతి ఆధారంగా రాష్టాల్రకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పాయింట్లను నీతి అయోగ్‌ విడుదల చేస్తోంది.