ఉత్తర భారతంలో వరద బీభత్సం

7 లక్షలమంది నిరాశ్రయులు.. 24 మంది మృతి
నీట మునిగిన వేలాది ఎకరాలు
న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 23 (జనంసాక్షి):
ఉత్తర భారతంలో వరద బీభత్సానికి ప్రజలు కకావికలమయ్యారు. దక్షిణ సిక్కింలోని చుంగ్‌ తంగాలో వరదల వల్ల ఆదివారం నాటికి దాదాపు 24 మంది ప్రాణాలు కోల్పోయారు. అరుణాచల్‌ ప్రదేశ్‌లో ముగ్గురు మృత్యువాత పడ్డారు. దాదాపు 7 లక్షల మంది ప్రజలు అస్సాంలో నిరాశ్రయులయ్యారు. సిక్కింలో ఈ నెల 19 నుంచి కురుస్తున్న వర్షాలు ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. లాచీన్‌నది ఉప్పొంగి రంగం, చుంగ్‌ తంగాలలో వేలాది ఇళ్లు నీట మునిగాయి. రోడ్లన్నీ ధ్వంసమయ్యాయి. ఈ రోడ్లు పునర్నిర్మించాలంటే కనీసం నెల రోజులు పడుతుందని రిలీఫ్‌ కమిషనర్‌ తెలియజేశారు. ఆర్మీ, ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఏరియల్‌ సర్వే జరిపింది. హెలికాప్టర్‌తో రిస్క్యూ టీం రంగంలోకి దిగి ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టింది. సైనికులు చేపట్టిన సహాయక చర్యలలో 9 మృతదేహాలు బయటపడ్డాయి. వ్యవసాయ పంటలు నీటమునిగాయి. రాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్‌ ప్రకటించింది. నదీ పరివాహక ప్రాంతంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలను ముమ్మరం చేశారు. అస్సాంలో 13 జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. బ్రహ్మపుత్ర నది ఉధృతంగా ప్రవహించి ఖజిరంగా, దిద్రూ, సైకోనోవా ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతినడమే కాకుండా ఇప్పటికీ నీటిలోనే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 60 సహాయక శిబిరాలను ఏర్పాటు చేసి వరద బాధితులకు సహాయక చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా వర్షాకాలం ప్రారంభం అయినప్పటి నుంచి అస్సాంను వరదలు ముంచెత్తడం ఇది మూడో సారి. దాదాపు 13 జిల్లాలను వరదలు తీవ్రంగా నష్టపరిచాయి. అస్సాంలోని బోయ్రా ప్రాంతంలో వరద బీభత్సానికి 150 ఇళ్లు ధ్వంసమై, 13వేల మంది నిరాశ్రయులయ్యారు. వందలాది ఎకరాల్లోని పంట ధ్వంసమైంది. రోడ్లు, కమ్యూనికేషన్‌ వ్యవస్థ దెబ్బ తినిపోయిందని ప్రభుత్వం సహాయం కోసం ఎదురు చూస్తున్నామని దాస్‌ అనే యువకుడు తెలిపారు. విష్ణుపురి గ్రామంలో 1500 మంది ప్రజలు ఇళ్లు కోల్పోయి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. రోడ్లన్నీ ధ్వంసమై కనిపించకుండా పోయాయి. జూన్‌లో సంభవించిన వరదలకు ఇళ్లన్నీ నీట మునిగి నీటిలో ఉన్నామని, ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రభుత్వం సహాయం అందలేదని బాధితులు తెలిపారు. సిక్కింలోని సరిహద్దు ప్రాంతంలో 20 మంది ప్రాణాలు కోల్పాయారు. దాదాపు 30 కిలోమీటర్ల వరకు జాతీయ రహదారి కనిపించకుండా కొట్టుకుపోయింది. బాధితులందరూ ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు.