ఉద్యమపంథాలో టిఆర్‌ఎస్ ప్రచారం
మంగళహారతులు, డప్పు చప్పుళ్లు
ఎక్కడికి వెళ్లినా చేరికలు ఉండేలా ప్లాన్
ధూమ్‌ధామ్‌లతో పాటల సందడి
హైదరాబాద్,నవంబర్5(జనంసాక్షి): తెలంగాణ ఉద్యమ తరహా ప్రచారంలో టిఆర్‌ఎస్ దూసుకుని పోతోంది.
టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు ప్రచారంలో ఇప్పటికే ముందంజలో ఉన్నారు. మహాకూటమిలో టికెట్ చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. జిల్లాల్లో మాత్రం టీఆర్‌ఎస్ అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటికీ తిరిగి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరుతున్నారు. మంగళహారతులతో మహిళలు, డప్పు చప్పుళ్లతో యువకులు, గ్రామస్తులు నృత్యాలు చేస్తూ ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు ఎంతగానో ఉపయోగపడ్డాయని, వారి ఉపాధి సైతం మెరుగుపడిందని వివరిస్తున్నారు. ప్రచారంలో ప్రధానంగా పలువురు నేతలను చేర్చుకునే కార్యక్రమం తప్పకుండా ఉండేలా చూసుకుంటున్నారు. అలాగే గిరిజన ప్రాంతాలకు వెళ్లినప్పుడు తండాలను,
గూడేలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసిందని పేర్కొటున్నారు. ప్రతిపక్షాల నాయకులు ఓట్ల కోసం తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని హెచ్చరిస్తున్నారు. నాలుగేళ్లలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ప్రజల కండ్లముందు కనపడుతుందన్నారు. 68 ఏళ్లుగా అధికారంలో ఉన్న ప్రతిపక్షాలు ప్రజలు సమస్యలను పట్టించుకోకపోవడం వల్లే తెలంగాణ అభివృద్ధి వెనుకబడిందన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు పనికట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎదరుదాడి చేస్తున్నారు. ఓటర్లు తమను మరోసారి ఆశీర్వదిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసే అవకాశం లభిస్తుందని హావిూలు గుప్పిస్తున్నారు. పనిలోపనిగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, అమ్మఒడి, కేసీఆర్ కిట్, రైతుబందు, రైతుబీమా, సన్నబియ్యం భోజనం, రూ.1 కిలో బియ్యం పంపిణీ, దళితబస్తీ పథకాలు పేదలకు ఎంతో ప్రయోజనకరంగా మారాయన్న విషయాన్ని వివరిస్తున్నారు. ప్రతిపక్షాలు సంక్షేమ పథకాలను అడ్డుకుంటున్నాయని, ఎన్నికల్లో ప్రజలు వారిని తిరస్కరించాలని కోరుతున్నారు. ప్రచారానికి వచ్చే నాయకులను గతంలో వారు చేసిన అభివృద్ధిపై నిలదీయాలంటున్నారు. ఎన్నికల పోలింగ్ తేదీకి సరిగ్గా నెల రోజులే మిగిలి ఉంది. నవంబర్ 12వ తేదీ నాడు ఎన్నికల నోటిఫికేషన్ సైతం వెలువడనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులు అప్రమత్తం అయ్యారు. ఇకపై ప్రతీ రోజును కీలకంగా తీసుకుని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా వెలువడిన తర్వాత మరింత వేగంగా ప్రచారాన్ని నిర్వహించేందుకు సైతం సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే ప్రచారంలో అన్ని రాజకీయ పార్టీల కన్నా టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం గాడిలో పడాలంటే మళ్లీ కేసీఆరే అధికారంలోకి రావాలన్న నినాదంతో అభ్యర్థులు ఎన్నికల రణరంగంలో తమదైన శైలిని ప్రదర్శిస్తున్నారు. ఇందుకోసం పాటుల, ధూమ్‌ధామ్‌లు, కోలాటాలు నిర్వహిస్తున్నారు. ప్రచారంలో సరికొత్తగా దూసుకుని పోతున్నారు.