ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తున్నాం

– ఇందుకోసం టీఎస్‌ఐపాస్‌ను అమల్లోకి తెచ్చాం
– ఈ విధానంతో ఇప్పటికే 3,500 పరిశ్రమలు ఏర్పాటయ్యాయి
– 40 వేలకు పైబడి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభించాయి
– విద్యుత్‌, ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
–  సూర్యాపేట జిల్లాలో మెగా జాబ్‌మేళాను ప్రారంభించిన మంత్రి
సూర్యాపేట, జులై30(జ‌నం సాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అనంతరం అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నారని, ఇందుకోసం టీఎస్‌ఐపాస్‌ను అమల్లోకి తీసుకురావటం జరిగిందని రాష్ట్ర విద్యుత్‌ మరియు ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉపాధి కల్పన కార్యాలయం, పురపాలక సంఘం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన మెగా జాబ్‌మేళాను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తున్నామని తెలిపారు. ఉపాధి అవకాశాల కోసం టీఎస్‌ఐపాస్‌ను అమల్లోకి తెచ్చామన్నారు. నూతన పారిశ్రామిక విధానం ద్వారా ఉపాధి అవకాశాలు సృష్టించొచ్చు అని సీఎం కేసీఆర్‌ నిరూపించారని తెలిపారు. ప్రపంచంలోని నలుమూలల నుంచి పారిశ్రామికవేత్తలు తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పడానికి ముందుకు వస్తున్నారని చెప్పారు. ప్రపంచంలోనే మొదటిసారిగా చేపట్టిన టీఎస్‌ఐపాస్‌ విధానంతో పారిశ్రామికవేత్తలు
ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పేందుకు బారులు తీరుతున్నారని మంత్రి పేర్కొన్నారు. ఈ విధానంతో ఇప్పటికే 3,500 పరిశ్రమలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నూతనంగా ఏర్పడ్డ పరిశ్రమలతో ఇప్పటికే 40 వేలకు పైబడి ఉపాధి అవకాశాలు లభించాయని మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. జిల్లా కలెక్టర్‌ సురేంద్ర మోహన్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక పురపాలక సంఘం అధ్యక్షురాలు గండూరీ ప్రవళిక ప్రకాశ్‌, సూర్యాపేట జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్‌ గౌడ్‌, స్థానిక ఏఎమ్‌సీ చైర్మన్‌ వై. వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మెగా జాబ్‌మేళాకు భారీ సంఖ్యలో యువతీయువకులు హాజరయ్యారు.
————————–