ఉపాధ్యాయులకు అండగా సిపిఎం

అరెస్ట్‌ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలి: మధు
విజయవాడ,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): ఉపాధ్యాయుల ఉద్యమానికి సిపిఎం అండగా ఉంటుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు పేర్కొన్నారు. గురువారం ఉదయం సిపిఎస్‌ ను రద్దు చేయాలంటూ.. చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన ఉపాధ్యాయులను విజయవాడ లెనిన్‌ సెంటర్‌ వద్ద పోలీసులు అరెస్ట్‌ చేశారు. అరెస్ట్‌ చేసిన ఉపాధ్యాయులందరినీ భవానీపురం పోలీస్‌ స్టేషన్‌ కు తరలించారు. ఈ విషయం తెలిసిన వెంటనే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, పశ్చిమ కృష్ణ కమిటీ కార్యదర్శి డివి.కృష్ణ, విజయవాడ పశ్చిమ సిటీ కార్యదర్శి నాగోతి ప్రసాద్‌, నగర నాయకులు
ఎల్‌.మోహనరావు, తదితరులు భవానీపురం పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. అరెస్టయిన ఉపాధ్యాయులను పరామర్శించి, అక్రమ అరెస్ట్‌లను నిరసించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల ఉద్యమానికి సిపిఎం అండగా ఉంటుందన్నారు. సిపిఎస్‌ ను రద్దు చేయకుండా, అక్రమంగా అరెస్టులకు ప్రభుత్వం పాల్పడిన తీరును తీవ్రంగా ఖండించారు. వెంటనే అరెస్టు చేసిన ఉపాధ్యాయులం దరినీ విడుదల చేయాలని మధు డిమాండ్‌ చేశారు.