ఉమ్మడి జిల్లాలో కంటివెలుగును విజయం చేయాలి: చందూలాల్‌

వరంగల్‌,ఆగస్ట్‌9(జ‌నం సాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఈనెల 15వ తేదీ నుంచి నిర్వహించనున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి ఉమ్మడి జిల్లాను రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలుపుదామని మంత్రి చందూలాల్‌ కోరారు. ఉమ్మడి జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు, వైద్య,ఆరోగ్య సిబ్బంది తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నత ఆలోచనలతో రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని కార్యక్రమాలను అమలు చేస్తున్నారన్నారు. దేశంలోనే కాదు, ప్రపంచంలో ఏ ప్రాంతంలోనూ జరగనన్ని అభివృద్ధి పనులను చేపడుతూ ప్రజల ఆరోగ్యంపై ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారన్నారు. ఇలాంటి కార్యక్రమం గతంలో ఎప్పుడూ ఎక్కడా జరగలేదన్నారు. ఒకేసారి నిర్ణీత గడువులోగా మూడున్నర కోట్ల మంది ప్రజలకు కంటి వైద్య

పరీక్షలను నిర్వహించి అవసరమైన వారికి ఆపరేషన్లు, కంటి అద్దాలను ఉచితంగా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవడం చారిత్రాత్మకం కానుందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది పేద ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ఒక్కొక్కసారి వేల రూపాయలు ఖర్చు చేయలేక పేదలు అంధత్వానికి గురవుతున్నారని మంత్రి పేర్కొన్నారు. ప్రజలకు మేలు చేసేలా ప్రజాప్రతినిధులు, అధికారులు, వైద్య ఆరోగ్య సిబ్బంది అవగాహన కల్పించాలని అన్నారు. జిల్లాలో వందశాతం లక్ష్యాన్ని పూర్తి చేసి రాష్ట్రంలో అగ్రగామిగా నిలుద్దామని మంత్రి పిలుపునిచ్చారు.