ఉమ్మడి హైకోర్టు సీజేగా..
రాధాకృష్ణన్ బాధ్యత స్వీకరణ
– రాజ్‌భవన్‌లో ప్రమాణం చేయించిన గవర్నర్ నర్సింహన్
– హాజరైన సీఎం కేసీఆర్, హైకోర్టు న్యాయమూర్తులు
హైదరాబాద్, జులై7(జనం సాక్షి) : ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ టీబీ రాధాకృష్ణన్ శనివారం ప్రమాణం చేశారు. హైకోర్టు 93వ చీఫ్ జస్టిస్‌గా(ఉమ్మడి హైకోర్టుకు రాధాకృష్ణన్ 4వ సీజే) తాజాగా ఆయన్ని నియమించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శనివారం ఉదయం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్ రాధాకృష్ణన్‌చే సీజేగా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, హైకోర్టు న్యాయమూర్తులు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల సీఎస్‌లు, డీజీపీలు, పలువురు మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాధాకృష్ణన్ 1959 ఏప్రిల్ 29న కేరళ రాష్ట్రంలోని కొల్లాంలో జన్మించారు. కర్నాటక కేజీఎఫ్ లా కాలేజి నుంచి ఆయన ఎల్‌ఎల్‌బీ చేశారు. 1983లో తిరువనంతపురం బార్ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకున్నారు. ఎర్నాకుళంలో ప్రముఖ న్యాయమూర్తిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 2004లో కేరళ హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. 2017 మార్చి 18న ఛత్తీస్‌గడ్ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 15 నెలల పాటు అక్కడ బాధ్యతలు నిర్వహించిన రాధాకృష్ణన్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల హైకోర్టు సీజేగా బాధ్యతలు చేపట్టారు.



