ఎంపీ, ఎమ్మెల్యేలు ఆస్తుల వివరాలపై.. విచారణకు సిద్ధమా?

– దమ్ముంటే అసెంబ్లీ, కేబినెట్‌ సమావేశాల్లో తీర్మానం చేయండి
– సగం మంది టీడీపీ ప్రజాప్రతినిధులు జైల్లోనే ఉంటారు
– సీఐడీ ‘చంద్రన్న ఇంట్రెస్ట్‌ డిపార్ట్‌ మెంట్‌’ గా మారింది
– అగ్రిగోల్డ్‌ ఆస్తులు రూ.25వేల కోట్ల నుంచి రూ.2.50కోట్లకు ఎలా తగ్గాయి
– కుంభకోణంలో ఎవరున్నా జైలుకెళ్లడం తప్పదు
– బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నర్సింహారావు
అమరావతి, అక్టోబర్‌23(జ‌నంసాక్షి) : తెదేపా ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆస్తుల వివరాలపై విచారణకు సిద్ధమా అని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నర్సింహారావు సవాల్‌ విసిరారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. దమ్ముంటే అసెంబ్లీలో లేదా కేబినెట్‌ సమావేశాల్లో ఈ విషయంపై తీర్మానం చేయాలని, అలా చేస్తే సగంది టీడీపీ ప్రజాప్రతినిధులు జైల్లోనే ఉంటారని అన్నారు. ఓ చాక్లెట్‌ కంపెనీ తన యాడ్‌ కోసం రమేష్‌ – సురేష్‌ అనే రెండు పాత్రలు సృష్టించి చాలా ఫేమస్‌ అయిపోయిందని, ఆ యాడ్‌కు వీక్షకుల నుంచి మంచి స్పందన కూడా వచ్చిందని, అయితే ఏపీ మంత్రి నారా లోకేష్‌ – టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ మధ్య బంధం రమేష్‌ – సురేష్‌ యాడ్‌ మాదిరిగా ఉంటుందంటూ సెటైర్లు వేశారు. లోకేష్‌తో చర్చకు రా అని సీఎం రమేష్‌ విసిరిన సవాల్‌కు నేను సిద్ధంమని జీవీఎల్‌ పేర్కొన్నారు. ఐటీ అధికారుల దాడులను ఫ్యాక్షనిస్టులని జేసీ దివాకర్‌రెడ్డి అనడం సరికాదన్నారు. జేసీ వ్యాఖ్యలు టీడీపీని తిడుతున్నట్టా?… పొగుడుతున్నట్టా? అని టీడీపీ నేతలు భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. ఫ్యాక్షన్‌ అంటే జేసీకి తెలుసు, అయినా ఐటీ అధికారులు దాడులకు కత్తులతో రారు, పెన్నులు కాగితాలతో వస్తారంటూ జీవీఎల్‌ సెటైర్లు వేశారు. సీఐడీ చంద్రన్న ఇంట్రెస్ట్‌ డిపార్ట్‌ మెంట్‌ గా మారిందని జీవీఎల్‌ ఆరోపించారు. అగ్రిగోల్డ్‌ ఆస్తులు రూ.25వేల కోట్ల నుంచి రూ.2.50కోట్లకు ఎలా కరిగాయని ఆయన  ప్రశ్నించారు. అగ్రిగోల్డ్‌ ఆస్తులు 254 ఉంటే 54 మాత్రమే ఇచ్చారన్నారు. అన్ని ఆస్తుల వివరాల్ని ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. పుల్లారావుపై ఆరోపణలు వస్తే నిజం కాదని సీఐడీ చెప్పిందన్నారు. మైనింగ్‌ విూద టీడీపీపై ఆరోపణలు వస్తే సరిగా దర్యాప్తు చేయలేదన్నారు. హాయిల్యాండ్‌ పై లోకేశ్‌ కన్ను ఉందని, అందుకే జాప్యం చేస్తుందన్నారు. అగ్రిగోల్డ్‌ ఆస్తులు కొట్టేయాలని ప్రయత్నం చేస్తున్నారన్నారు. బ్యాంకులకు లేఖ రాసి.. వేలం సరిగా వేయాలని కోరతానన్నారు. ఈ కుట్రలో ఎవరున్నా జైలుకు వెళ్లక తప్పదని జీవీఎల్‌ పేర్కొన్నారు.