ఎగ్జిట్ పోల్ అంచనాలు తప్పు
గతంలోనూ ఇలాగే జరిగింది: బిజెడి
భువనేశ్వర్,మే20(జనంసాక్షి): ఆదివారం వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పు అని బీజూ జనతా దళ్(బీజేడీ) అధికార ప్రతినిధి సస్మిత్ పాత్రా స్పష్టం చేశారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో బీజేడీ కీలకపాత్ర పోషిస్తుందని ఆయన తెలిపారు. శాసనసభతో పాటు లోక్‌సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వరుసగా ఐదోసారి ఒడిశాలో తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. 2009 సాధారణ ఎన్నికల సమయంలో 21 లోక్‌సభ స్థానాలకు గానూ బీజేడీకి 6 నుంచి 7 స్థానాలు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వేశాయి. కానీ అది తప్పని రుజువైంది. ఆ సమయంలో తమ పార్టీ 14 లోక్‌సభ స్థానాలను గెలుచుకుందని గుర్తు చేశారు. 2014 ఎన్నికల సమయంలో కూడా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పాయని సస్మిత్ పాత్రా తెలిపారు. అప్పుడు తమకు 12 -14 స్థానాలు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ చెప్పగా.. తాము 20 స్థానాల్లో గెలుపొందాము అని సస్మిత్ గుర్తు చేశారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుందన్నారు. భారతీయ జనతా పార్టీకి పూర్తి స్థాయి మెజార్టీ వచ్చే అవకాశం లేదన్నారు. మే 23 వరకు వేచి చూడడం మంచిదని సస్మిత్ పాత్రా పేర్కొన్నారు.



