ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండండి

101 శాసనసభ స్థానాల్లో విజయం మనదే: సీఎంహైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన తెరాస విస్తృత స్థాయి సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా తాజా పరిణామాలపై పార్టీ నేతలతో చర్చించిన సీఎం కేసీఆర్‌.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని సూచించారు. ముందస్తు ఎన్నికలు వస్తాయన్న ఊహాగానాలపై మాత్రం ఈ సమావేశంలో ఎలాంటి స్పష్టత రాలేదు. సెప్టెంబరు నెలాఖరు, అక్టోబర్‌ మొదటి వారంలోనే అభ్యర్థులను ఖరారు చేస్తామని చెప్పినట్లు సమాచారం. కేవలం పది స్థానాల్లోనే ప్రతిపక్షాలకు మనకు పదిశాతం మాత్రమే ఓట్ల తేడా వస్తుందని సీఎం వివరించారు. మిగతా అన్ని నియోజకవర్గాల్లో ప్రతిపక్షాలకు అందనంత దూరంలో తెరాస ఉందన్నారు. నాలుగు, ఐదు స్థానాల్లోనే అభ్యర్థులను మార్చే పరిస్థితి ఏర్పడవచ్చని, అభ్యర్థుల మార్పు సిట్టింగులతో మాట్లాడే చేస్తామని చెప్పినట్లు సమాచారం. సెప్టెంబరు 2న జరిగే ప్రగతి నివేదన సభను విజయవంతం చేసేందుకు కృషి చేయాలని, ప్రతి నియోజకవర్గం నుంచి కనీసం 25వేల మంది హాజరయ్యేలా చూడాలని నేతలను ఆదేశించారు. దాదాపు 27లక్షల మంది సభకు హాజరవుతారని చెప్పారు. జనసమీకరణకు అవసరమైన వాహనాలు పొరుగు రాష్ట్రాల నుంచి తెప్పించుకోవాలని సీఎం సూచించారు. రాష్ట్ర మంత్రులు ఈటల రాజేందర్‌, కేటీఆర్‌, కడియం శ్రీహరి, హరీశ్‌రావు, మహమూద్‌ అలీ, నాయిని నర్సింహారెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.