ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమే

– ఎన్నికల్లో ఎలాంటి పొత్తులు ఉండవు
– సింహం సింగిల్‌గానే వస్తుంది
– రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌
– ప్రగతి నివేదన సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి
హైదరాబాద్‌, ఆగస్టు28(జ‌నం సాక్షి) : రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తులు పెట్టుకొనే పరిస్థితి లేదని, సింహం సింగిల్‌గానే వస్తుందన్నారు. వచ్చేనెల 2వతేదీన కొంగరకొలాన్‌లో టీఆర్‌ఎస్‌ నిర్వహించే ప్రగతి నివేదన సభ ప్రాంగణాన్ని మంగళవారం మంత్రి పరిశీలించారు. అనంతరం విూడియాతో మాట్లాడుతూ… ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీఆర్‌ఎస్‌ సిద్ధంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్‌ చెప్పినట్టు 100 స్థానాలు గెలుస్తామని, అయితే… ఎన్నికలు ఎప్పుడు వస్తాయన్న విషయం మాకు తెలియదన్నారు. శాసనసభ రద్దు అంశం క్యాబినెట్‌ పరిధిలో ఉంటుందని కేటీఆర్‌ తెలిపారు. అంతేకాని పార్లమెంట్‌ సభ్యులకు,శాసనసభ్యులకు సంబంధం లేదన్నారు. అలాగే ప్రధానమంత్రి మోదీని కేసీఆర్‌ కలవడంపై వస్తున్న విమర్శలపై కేటీఆర్‌ మాట్లాడుతూ.. మోదీ ప్రధానమంత్రి కాబట్టే కేసీఆర్‌ కలిశారన్నారు. అలాగే నేను ఢిల్లీలో ఎన్నికల కమిషన్‌ను కలవలేదన్నారు. రాష్ట్రంలో 16 ఎంపీ సీట్లను గెలుస్తామని, 17వ సీటు గురించి మాట్లాడనని కేటీఆర్‌ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీతో పొత్తుపెట్టుకుంటే ప్రజలు గుడ్డలూడదీసి కొడతారని టీడీపీ ఉపముఖ్యమంత్రి అన్నారని కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లగా.. అయినా… లేని టీడీపీతో మాకు పొత్తు ఏమిటని, వాళ్ళు వస్తాం అంటే మేము చేసేది ఏవిూ లేదన్నారు. చేరికలు ఆగలేదని,  ఇంకా ఉన్నాయని విూరే చూస్తారన్నారు. వచ్చే నెలలో చాలా మంది కాంగ్రెస్‌ నుంచి నాయకులు వస్తారని,  మళ్ళీ ప్రభుత్వం మాదే.. కేసీఆరే మా సీఎం అంటూ మంత్రి పేర్కొన్నారు.