ఎపి సర్కార్‌ సంచలన నిర్ణయం

ఉద్యమ కేసుల ఎత్తివేతకు ఆదేశాలు
అగ్రిగోల్‌ బాధితులకు 10వేల లోపుచెల్లింపులు
అమరావతి,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): ఏపీ సర్కార్‌ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. సమైక్యాంధ్ర ఉద్యమంలో ఉద్యమకారులపై నమోదైన కేసులన్నీ ఎత్తివేసింది. కేసులు ఎత్తివేస్తూ ¬ంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్‌ స్టేషన్లలో నమోదైన కేసులను ఎత్తివేసే విధంగా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ¬ంశాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్‌ అనురాధ.. డీజీపీకి సూచించింది. అలాగే అగ్రిగోల్డ్‌ బాధితులకు ఊరట కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రూ.10వేల లోపు డిపాజిట్లు ఉన్న బాధితులకు రాష్ట్ర ప్రభుత్వమే పరిహారం చెల్లించాలని నిర్ణయించారు. ఈ డిపాజిట్లను తిరిగి చెల్లించేందుకు రూ.250 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అగ్రిగోల్డ్‌ వద్ద రూ.10వేల లోపు డిపాజిట్‌ చేసిన బాధితులకు తొలుత చెల్లింపులు చేసేందుకుగాను ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం పర్యవేక్షణలో జిల్లాస్థాయి కమిటీల ద్వారా చెల్లింపులు చేయాలని ప్రభుత్వం తన ఆదేశాల్లో పేర్కొంది. దేశ వ్యాప్తంగా 32లక్షల మంది నుంచి అగ్రిగోల్డ్‌ సంస్థ రూ.6,380 కోట్లు డిపాజిట్ల రూపంలో సేకరించింది. ఇందులో ఏపీలోనే 10లక్షలకు పైగా డిపాజిటర్లు ఉంటారని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇందులో రూ.10వేల లోపు డిపాజిట్‌ చేసిన మదుపుదారులు 3.5లక్షలు ఉన్నారని సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది. దీంతో పాటు రూ.500 కోట్ల మేర అగ్రిగోల్డ్‌ సంస్థ వివిధ బ్యాంకులను మోసగించినట్లు దర్యాప్తులో తేలింది.   అగ్రిగోల్డ్‌ జారీ చేసిన చెల్లని చెక్కుల విలువ రూ.700కోట్లు మేర ఉంటుందని విచారణలో వెల్లడైంది. అగ్రిగోల్డ్‌ ఆస్తులను జప్తు చేసి వేలం వేసేందుకు మరింత సమయం పట్టే అవకాశమున్నందున ముందుగా చిన్న మొత్తంలో డిపాజిట్లను తిరిగి చెల్లించాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.