ఎఫ్‌డీఐలపై భగ్గుమన్న యూపీఏ మిత్రపక్షాలు

మద్దతు ఉపసంహరణకే తృణముల్‌ మొగ్గు
అదేబాటలో ఎస్పీ, బీఎస్పీ

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 15 (జనంసాక్షి)ః
కేంద్ర ప్రభుత్వ దూకుడు నిర్ణయాలతో యూపీఏ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. డీజిల్‌ ధర పెంపు, వంటగ్యాస్‌పై పరిమితి విధించడంతో పాటు తాజాగా రిటైల్‌ రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతిస్తూ.. కేంద్రం తీసుకున్న నిర్ణయాలపై ప్రతిపక్షాలతో పాటు మిత్రపక్షాల నుంచి కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎఫ్‌డీఐలపై నిర్నయాన్ని తక్షణమే వెనక్కు తీసుకోవాలని యూపీ భాగస్వామ్య పక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. లేకుంటే, మద్దతు ఉపసం హరించే విషయమై కఠిన నిర్ణయాలు తీసు కోవాల్సి ఉంటుందని హెచ్చరించాయి. యూపీఏలో కీలక భాగస్వామి అయిన తృణమూల్‌ కాంగ్రెస్‌తో పాటు బయటి నుంచి మద్దతు
ఇస్తున్న సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీ ఇప్పటికే ప్రభుత్వాన్ని హెచ్చరికలు జారీ చేశాయి. ఇప్పటికే డీజిల్‌ ధర పెంపు, వంటగ్యాస్‌పై పరిమితి విధించడంపై ఆగ్రహంతో ఉన్న బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. శుక్రవారం నాటి తాజా నిర్ణయాలతో అగ్గివిూద గుగ్గిలమయ్యారు. రిటైల్‌ రంగంలోకి ఎఫ్‌డీఐలపై నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకుంటే.. కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని శనివవారం ఫేస్‌బుక్‌లో హెచ్చరించారు. అలాగే, డీజిల్‌ ధర పెంపు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని, వంటగ్యాస్‌పై పరిమితి ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని యూపీఏలో కీలక భాగస్వామ్య పక్షమైన తృణమూల్‌ కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ప్రభుత్వానికి 72 గంటల గడువు విధించింది. యూపీఏకు మద్దతు కొనసాగించాలా? వద్దా? అనే అంశంపై మంగళవారం నిర్ణయం తీసుకుంటామని మమతా బెనర్జీ ప్రకటించారు. మరోవైపు, సమాజ్‌వాదీ పార్టీ కూడా మద్దతు ఉపసంహరించే విషయమై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది.
మరోవైపు, యూపీఏకు బయటి నుంచి మద్దతిస్తున్న బీఎస్పీ కూడా ప్రభుత్వాన్ని అల్టీమేటం జారీ చేసింది. డీజిల్‌ ధర పెంపు, రిటైల్‌ సెక్టార్‌లోకి విదేశీ పెట్టుబడులను అనుమతించడాన్ని ప్రజా వ్యతిరేక చర్యగా అభివర్ణించింది. ఈ నేపథ్యంలో యూపీఏ ప్రభుత్వానికి మద్దతు కొనసాగించే విషయమై బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరాం ఆరో వర్ధంతి రోజైన అక్టోబర్‌ 9 నిర్ణయం తీసుకుంటామని ఆ పార్టీ చీఫ్‌ మాయావతి శనివారం ప్రకటించారు. ‘ప్రభుత్వం రెండు, మూడు రోజులుగా కొన్ని ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంది’ అని మాయావతి లక్నోలో విలేకరులతో అన్నారు. కాన్సీరాం వర్ధంతి అయిన అక్టోబర్‌ 9న భారీ ర్యాలీ నిర్వహించనున్నామని చెప్పారు. ఆ రోజు లేదా, తర్వాతి రోజు పార్టీ కార్యవర్గం సమావేశమై యూపీఏకు మద్దతు కొనసాగించే అంశంపై నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించారు.
డీజిల్‌ ధర పెంపు, వంటగ్యాస్‌పై పరిమితి విధించడం వల్ల రైతులు, పేద, మధ్య తరగతిప్రజలపై పెనుభారం పడుతుందన్నారు. డీజిల్‌ ధర పెంపు వల్ల నిత్యావసర ధరలు మరింత పెరుగుతాయని, ప్రజా జీవనం అస్తవ్యస్తమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎఫ్‌డీఐలకు తమ పార్టీ వ్యతిరేకమన్నారు. తృణమూల్‌, ఎస్పీ, బీఎస్పీలు మద్దతు ఉపసంహరిస్తే.. యూపీఏ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయం. ఈ నేపథ్యంలో కేంద్ర మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.