ఎవరెన్ని కుట్రలుచేసినా.. టీడీపీ గెలుపును అడ్డుకోలేరు


– మనం సాంకేతికను ప్రోత్సహిస్తుంటే.. ప్రతిపక్షం సైబర్‌ కైమ్ర్‌ను ప్రోత్సహిస్తుంది
– డేటాను దొంగిలించే నీచానికి ఒడిగట్టారు..!
– 8లక్షల టీడీపీ ఓట్లు తొలగించేందుకు కుట్ర జరుగుతుంది
– ఓటమిభయంతో తెలంగాణలో మనపై కేసులు పెడుతున్నారు
– హైదరాబాద్‌లో వ్యాపారసంస్థలకు భద్రతలేదు
– ఓట్ల తొలగింపుపై గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేయండి
– ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి, మార్చి4(జ‌నంసాక్షి) : రాబోయే ఎన్నికల్లో టీడీపీ ఓడించేందుకు ప్రతిపక్షనేత జగన్‌ టీఆర్‌ఎస్‌, బీజేపీ మద్దతుతో కుట్రలు చేస్తున్నాడని, ఎవరెన్ని కుట్రలు చేసినా టీడీపీ గెలుపును అడ్డుకోలేరని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్‌లో చంద్రబాబు మాట్లాడారు.. మనం సాంకేతికతను ప్రోత్సహిస్తుంటే.. ప్రతిపక్షం సైబర్‌ కైమ్ర్‌ను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు ఫస్టేష్రన్‌తో తెలంగాణలో మనపై కేసులు పెట్టే స్థితికి వైసీపీ దిగజారిందని మండిపడ్డారు. 20ఏళ్ల నుంచి పార్టీ సమాచారం కంప్యూటరీకరించామని, దానిని తెలంగాణ ప్రభుత్వ సాయంతో దొంగలించే నీచానికి ఒడిగట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయస్థానంతో చివాట్లు తినటం వాళ్లు ఒడిగట్టిన నీచానికి చెంపచెట్టన్నారు. ఓటమి భయంతోనే రాష్ట్రంలో మన ఓట్లు తొలగించే ప్రక్రియ చేపట్టారని.. గెలవలేమనే ఈ కుట్రలకు దిగజారారని వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ముందే వైసీపీ ఓటమిని అంగీకరించి దిగజారుడు
రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. ఈ దుర్మార్గాలకు మోడీ, కేసీఆర్‌ సహకరిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. 8లక్షల టీడీపీ ఓట్లు తొలగించేందుకు కుట్ర పన్నారని ఆరోపించిన చంద్రబాబు.. సైబర్‌ కైమ్ర్‌ను ప్రోత్సహిస్తున్నారన్నారు. వీటన్నింటికీ గట్టిగా గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని.. బోగస్‌ ఓట్ల పేరుతో తొలగింపునకు పాల్పడిన వారందరిపైనా క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వైసీపీ అధికారంలోకి వస్తే ఇంకెన్ని సంఘ విద్రోహ చర్యలకు పాల్పడతారో ముందుగానే చూపిస్తున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. సైబర్‌ కుట్రలతో హైదరాబాద్‌ను అభద్రతలోకి నెట్టారని, వ్యాపార కంపెనీలకు హైదరాబాద్‌లో భద్రత లేని దుస్థితి నెలకొందన్నారు. అలాగే టీడీపీకి సేవలు అందించే కంపెనీలపై దాడులు చేస్తున్నారని, వైసీపీ, టీఆర్‌ఎస్‌ కుట్రలకు కంపెనీలను బలి చేస్తున్నారని ఆయన అన్నారు. ఓటమి భయంతోనే బిహారీ గ్యాంగ్‌ తప్పుడు పనులు చేస్తోందన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు..
ఓట్ల తొలగింపుపై గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నేతలకు పిలుపునిచ్చారు. ఓట్ల నమోదు, తొలగింపులో తప్పుడు పనులను సహించబోమని తేల్చిచెప్పారు. తప్పుడు దరఖాస్తుదారులపై కఠిన చర్యలు తప్పవని సీఎం హెచ్చరించారు. దొంగ సంతకాలు పెట్టిన వారందరినీ గుర్తించాలని అధికారులను ఆదేశించారు. సైబర్‌ నేరగాళ్లను ఎవరినీ వదిలేది లేదని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. నేరాలు చేయడంలో వైకాపా నేతలు ఆరితేరారని ఆయన దుయ్యబట్టారు.