ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల అమలుకు

అవసరమైతే రాజ్యాంగ సవరణ
ప్రధాని మన్మోహన్‌సింగ్‌
న్యూఢిల్లీ, ఆగస్టు 21 (జనంసాక్షి) : ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల అమలుకు అవసరమైతే రాజ్యాంగ సంరణ చేయడానికైనా సిద్దమని ప్రధాని మన్మోహన్‌ అన్నారు. మంగళవారం ప్రధాని నివాసంలో అఖిల పక్ష సమావేశం జరిగింది. సమావేశ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని, దీనికి అవసరమైతే రాజ్యాంగ సవరణ కూడా చేస్తామని ఆయన తెలిపారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి చేయడానికి చిత్తశుద్దితో కృషి చేస్తున్నామని, వారిని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగాల్లో పదోన్నతుల విషయంలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని సమాజ్‌వాది పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే ఓబీసీలకు కూడా రిజర్వేషన్లను కల్పించాలని ప్రధానిని కోరినట్లు టీడీపీ ఎంపీలు వెల్లడించారు. ఉద్యోగ నియామకాల్లో ఓబీసీలకు పూర్తి న్యాయం చేయాలని కోరినట్లు ఎంపీ నామా నాగేశ్వరరావు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలందరికీ అన్యాయం జరగకుండా చూడాలని, రిజర్వేషన్లతో అందరికీ మేలు జరగాలని పలు పార్టీల ప్రతినిధులు ప్రధానిని కోరారు.