ఏకాభిప్రాయం పేరుతో తెలంగాణ ప్రజల్ని ప్రధాని మోసం చేస్తుండు

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి
హైదరాబాద్‌ ,సెప్టంబర్‌ 16 (జనంసాక్షి): ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు విషయంలో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఏకాభిప్రాయం పేరుతో తెలంగాణ ప్రజలను మోసపుచ్చు తున్నారని సుప్రికోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి ఆరోపించారు. అలాగే తెలంగాణ ప్రాంతంపై ఆదివారం సుందరయ్య కళానిలయంలో ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ (ఏపీటీఎఫ్‌) ఆధ్యర్యంలో తెలంగాణ ఉద్యమం-ప్రస్తుత పరిస్థితులు, ఉపాధ్యాయుల కర్తవ్యం అనే అంశంపై రాష్ట్ర సదస్సు జరిగింది. సదస్సుకు ముఖ్యఅతిధిగా హాజరైన జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ అంశంపై ప్రధాని మాట్లాడకుండా ఉంటున్నా రని, ఆ అంశంపై తప్పనిసరిగా నోరు విప్పాల్సి వస్తే ఏకాభిప్రాయం కావాలి కాదా.. హైదరాబాద్‌ పరిస్థితి ఏంటి.. అని తప్పించుకునే ధోరణితో మాట్లాడుతున్నారని విమర్శించారు. దోపిడి దౌర్జన్యం ఉన్నంతకాలం నక్సలిజం ఉంటుందన్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో సరళీకరణ విధానాలపై అవగాహన లేకపోతే తెలంగాణ సమస్య పరిష్కారం కాదన్నారు. సున్నితమైన తెలంగాణ అంశాన్ని పాలకులే జటిలంగా మారుస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంపై తీవ్ర ఒత్తిడి పెంచితేనే రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం కదులుతుందన్నారు. ప్రపంచీకరణ శక్తులు తెలంగాణ విధ్వంసానికి కుట్రచేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం వస్తే అన్యాక్రాంతమైన నగర పరిసర భూములను మళ్లీ వెలికితీస్తారనే గుబులు పుటుకుందన్నారు. ఇది గుప్పెడు మంది సీమాంధ్రులు, పెట్టుబడిదారులు కలసి ఆడుతున్న నాటకమన్నారు. దీనిని సంఘటితంగా ఎదుర్కోవాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ వ్యతిరేకులకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. సీనియర్‌ పాత్రికేయులు టంకశాల అశోక్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ అధికారం కోసం ఏదైన చేస్తుందని విమర్శించారు. ఈ ప్రభుత్వాన్ని మళ్లీ ఉక్కిరిబిక్కిరి చేసి రాష్ట్రం సాధించుకోవాలన్నారు. ఏపీటీఎఫ్‌ పూర్వ అధ్యక్షులు నర్సింహ్మరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంతోనే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. ఈ పోరాటంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలన్నారు. తెలంగాణ ప్రాంత ఉపాధాయుల సమస్యలను పరిష్కరించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌళిక సదుపాయాలను కల్పించి, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలన్నారు. ఐకాస స్టీరింగ్‌ కమిటీ సభ్యులు సూర్యం మాట్లాడుతూ.. సెప్టెంబర్‌ 30న జరిగే తెలంగాణ మార్చ్‌ను జయప్రదం చేయాలన్నారు. అనంతరం పలు తీర్మాణాలను ప్రవేశపెట్టారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్‌ అధ్యక్షుడు వేణుగోపాల్‌, రవిచంద్ర, చంద్రమౌళి, మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు.