ఏదో ఒకటి తేల్చండి!

– విూరన్నా ఏర్పాటు చేయండి..
రాష్ట్రానికన్నా అవకాశం ఇవ్వండి
– ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుపై కేంద్ర మంత్రికి విన్నవించిన టీడీపీ ఎంపీలు
– వారం రోజుల్లో స్పష్టత ఇస్తామన్న మంత్రి
న్యూఢిల్లీ, అక్టోబర్‌13(జ‌నంసాక్షి) : కడపలో ఎక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుపై ఏదో ఒకటి తేల్చాలని, కేంద్రం ఆధ్వర్యంలో అన్నా ఏర్పాటు చేయాలని, అలా సాధ్యం కాకుంటే రాష్ట్రానికి కన్నా అవకాశం ఇవ్వాలని కేంద్ర ఉక్కు కర్మాగార మంత్రి బీరేంద్రసింగ్‌ను ఏపీ టీడీపీ ఎంపీలు కోరారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం టీడీపీ ఎంపీలు శనివారం ఉదయం ఢిల్లీలో కేంద్రమంత్రి బీరేంద్రసింగ్‌తో  సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎంపీలు సుజనాచౌదరి, సీఎం రమేష్‌, జేజి దివాకర్‌రెడ్డి, జయదేవ్‌ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా కడపలో స్టీలు ప్లాంటు ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని ఎంపీలు కోరారు. ప్రధానంగా ఐదు డిమాండ్లను ఎంపీలు.. కేంద్రమంత్రి ముందుకు తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.
కడపలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుపై కేంద్రం ఏదో ఒకటి తేల్చాలని, కేంద్రం ఏర్పాటు చేయకపోతే ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఏపీకి అవకాశం కల్పించాలని విన్నవించారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా ఏర్పాటుకు కృషి చేయాలని ఎంపీలు కేంద్ర మంత్రిని కోరారు. కేంద్రం, రాష్ట్రం, ప్రైవేట్‌ భాగస్వామ్యానికి అంగీకారమా?, కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం ప్రైవేట్‌ సెక్టార్‌ను ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇస్తారా? కేంద్ర మంత్రికి అందించిన ఎంపీలు లేఖలో పేర్కొన్నారు. భేటీ అనంతరం సుజనాచౌదరి, రమేష్‌లు మాట్లాడుతూ.. ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర మంత్రిని కలవడం జరిగిందన్నారు. వారం రోజుల్లో  కడప స్టీల్‌ ప్లాంట్‌ పై ఉక్కు మంత్రి ప్రెస్‌ నోట్‌ ఇస్తామన్నారని అన్నారు. కానీ.. స్టీల్‌ ప్లాంట్‌ విషయం ఉక్కు మంత్రి ఏదీ స్పష్టంగా చెప్పలేక పోతున్నారని, ఆయన తీరు చూస్తుంటే ఫ్యాక్టరీ నిర్మాణం ఆయన చేతిలో లేనట్టు ఉందని అన్నారు. రాజకీయాలతోనే స్టీల్‌ ప్లాంట్‌ను ఆలస్యం చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఏపీ ప్రభుత్వం  స్టీల్‌ ప్లాంట్‌ పెట్టేందుకు అనుమతి ఇవ్వాలని కోరామన్నారు. అనుభవం లేని అనిల్‌ అంబానీకి రాఫెల్‌ విమానాల కాంట్రాక్టు ఇచ్చారని, రాష్ట్ర ప్రభుత్వం స్టీల్‌ ఫ్యాక్టరీ పెట్టేందుకు అనుమతి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. వారం రోజుల్లో కేంద్ర మంత్రి కడప ఉక్కు ఫ్యాక్టరీపై లేఖ విడుదల చేయకుంటే తాము తరువాత చేయాల్సిన కార్యాచరణను నిర్దేశించుకుంటామని అన్నారు. అనంతరం మరో ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి మాట్లాడుతూ.. కడపలో స్టీల్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఈ దఫా కేంద్ర మంత్రి సానుకూలత వ్యక్తం చేశారని, వారం రోజులు గడువు తరువాత ఏ విషయమైంది చెబుతామన్నారని, ఏం చేస్తారో చూడాలంటూ పేర్కొన్నారు.

తాజావార్తలు