ఏపీపై కేంద్ర ప్రభుత్వం..  కక్షపూరితంగా వ్యవహరిస్తుంది

– ఐటీ దాడులతో భయబ్రాంతులకు గురిచేయాలని చూస్తుంది
– భయపడేది లేదు.. అధికారులకు స్వాగతం పలికి అన్నీ వివరిస్తాం
– కేంద్రం సీబీఐపై విశ్వాసం కోల్పోయే పరిస్థితికి తీసుకొచ్చింది
– అప్రమత్తతతో తిత్లీ తుఫాను నష్టాన్ని నివారించాం
– ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి, అక్టోబర్‌25(జ‌నంసాక్షి) : ఏపీపై కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని, వరుసగా ఐటీ దాడులు నిర్వహిస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఇలాంటి కుట్రల పట్ల తాము భయపడబోమని, అధికారులకు స్వాగతం పలికి అన్నీ వివరిస్తామని అన్నారు. గురువారం కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడారు.. రోజు విడిచి రోజు ఐటీ దాడులు చేస్తున్నారని, దొంగ వ్యాపారం చేసేవారు ఏపీలో లేరని అన్నారు. ఐటీ అధికారులకు స్వాగతం చెప్పి.. ఇక్కడ ఏం జరుగుతుందో వివరంగా చెబుతామని చంద్రబాబు స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్రం సీబీఐని భ్రష్టుపట్టించిందని, నిబంధనల్ని కాలరాసి మోదీ అర్ధరాత్రి నిర్ణయాలు తీసుకున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. తప్పులు బయటపడతాయనే భయంతో సీబీఐ డైరెక్టర్‌ను మార్చారని సీఎం విమర్శించారు. చివరికి సీబీఐపై విశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితి తీసుకొచ్చారని ఆరోపించారు. కేంద్రం వ్యవస్థలన్నింటినీ దుర్వినియోగం చేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. సీబీఐలో జరుగుతున్న పరిణామాలు మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. వెనుకబడిన జిల్లాలకు కేంద్రం నిధులు ఇచ్చి మరీ వెనక్కు తీసుకుందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో ఎన్నికలు ఉన్నందున ఆ రాష్ట్రానికి నిధులు ఇచ్చిందన్నారు. ఏపీకి ప్రత్యేక ¬దా ఇవ్వలేదని… ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వలేదన్నారు. పైగా ఇచ్చిన నిధులు వెనక్కి తీసుకున్నారని, పోలవరం నిధులు కూడా ఇవ్వలేదని చంద్రబాబు విమర్శించారు. స్మార్ట్‌ సిటీల వల్ల రాష్ట్రాని కంటే కేంద్రానికే ఎక్కువ ఆదాయం వస్తుందని, కేంద్రం పట్టణాల అభివృద్ధికి నిధులు అరకొరగానే ఇస్తోందని చంద్రబాబు విమర్శించారు. గడిచిన నాలుగేళ్లలో దేశంలో ఎక్కువ వృద్ధి రేటు సాధించామని, 10.52 శాతం వృద్ధి సాధించిన ఏకైక రాష్ట్రం ఏపీ అని చంద్రబాబు నాయుడు అన్నారు. తితలీ తుపానుపై ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేశామన్నారు. తుపాను సమాచారం రాగానే ముందుజాగ్రత్త చర్యలపై ఆలోచించామని, అర్ధరాత్రి అధికారులతో మాట్లాడి ప్రాణనష్టాన్ని గణనీయంగా తగ్గించగలిగామని చెప్పుకొచ్చారు. 15 మంది మంత్రులు, 110 మంది డిప్యూటీ కలెక్టర్లు అప్రమత్తమయ్యారన్నారు. 20 రోజుల్లో సాధారణ పరిస్థితులు తీసుకొచ్చామని.. ఇది గొప్ప విషయమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకెళ్తున్నామని తెలిపారు. అగ్రికల్చర్‌ నుంచి హార్టికల్చర్‌కు మారాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఈ దిశగా రైతులను ప్రోత్సాహించాల్సిన అవసరం ఉందన్నారు. హార్టికల్చర్‌లో రిస్క్‌ తక్కువ.. ఆదాయం ఎక్కువ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.