ఏపీలో మాఫియా రాజ్యం నడుస్తోంది

– అగ్రిగోల్డ్‌ భూములను కొట్టేసేందుకు కుట్ర!
– బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతాం
– బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నర్సింహరావు
– అగ్రిగోల్డ్‌ ఆస్తులను రోజురోజుకు తగ్గిస్తున్నారు – కన్నా
– ఆంబోతు రాజకీయాలు చేసేది టీడీపీ నేతలే – రామ్‌మాధవ్‌
– అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేయాలని బీజీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభం
– ఐదురోజుల పాటు సాగనున్న రిలేనిరాహార దీక్షలు
విజయవాడ, అక్టోబర్‌22(జ‌నంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌లో మాఫియా రాజ్యం నడుస్తోందని, ప్రభుత్వం అవినీతి పరులను పెంచి పోషిస్తుందని బీజేపీ అధికార ప్రతినిధి, పార్లమెంటు సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు విమర్శించారు. అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ.. సోమవారం విజయవాడ ధర్నాచౌక్‌లో బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన ఐదురోజుల రిలేనిహార దీక్షలను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌ మాధవ్‌ ప్రారంభించారు.  పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ, పార్లమెంటు సభ్యుడు జీవీఎల్‌ సహా పలువురు ముఖ్య నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జీవీఎల్‌ నర్సింహారావు మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఏపీ ప్రభుత్వ పెద్దల అవినీతి కారణంగానే అగ్రిగోల్డ్‌ బాధితులకు అన్యాయం జరుగుతోందని విమర్శించారు. ప్రజల సొమ్మును దోచుకునేందుకు తెలుగుదేశం నేతలు యత్నించారని ఆరోపించారు. ఏపీలో మాఫియా రాజ్యం నడుస్తోందని దుయ్యబట్టారు. అధికార పార్టీకి అనుకూలమైన ల్యాండ్‌ మాఫియాకు అగ్రిగోల్డ్‌ భూములను అప్పగించేందుకు కుట్ర జరుగుతోందన్నారు. ప్రస్తుతం ఏపీలో బిహార్‌ లో మాజీ సీఎం లాలూప్రసాద్‌ యాదవ్‌ తరహాలో అవినీతి ప్రభుత్వం నడుస్తోందని జీవీఎల్‌ ఘాటుగా విమర్శించారు. బిహార్‌ లో లాలూ నాయకత్వంలోని రాష్టీయ్ర జనతాదళ్‌(ఆర్జేడీ)కి పట్టిన గతే టీడీపీకి వస్తుందని హెచ్చరించారు. ఎన్నికలు సవిూపిస్తున్న కొద్దీ టీడీపీ అక్రమాలు పెరిగిపోతున్నాయని నరసింహారావు ఆరోపించారు. అమరావతిలో భూములు దోచుకున్నట్లే ఇక్కడా చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ నేతలకు కాంట్రాక్టుల కంటే దందాల్లోనే అనుభవముందన్నారు. టీడీపీ నేతలు మళ్లీఅధికారంలోకి రామనే ఉద్దేశంతో ఆ పార్టీలు ఎంపీలే నేరుగా కాంట్రాక్టర్లు తీసుకుంటూ దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అగ్రిగోల్డ్‌ ఆస్తులను రోజురోజుకు తగ్గిస్తున్నారు – కన్నా లక్ష్మీనారాయణ
చంద్రబాబు అత్యాశకారణంగా ఆ సంస్థలో పెట్టుబడులు పెట్టిన 32లక్షల కుంటుబాలు రోడ్డున పడ్డాయని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు, ఆయన తనయుడు అగ్రిగోల్డ్‌ ఆస్తులను దోచుకుంటున్నారని ఆరోపించారు. లోకేశ్‌ అడిగిన ధరకు హాయ్‌ లాండ్‌ ను ఇవ్వలేదని, ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. అగ్రిగోల్డ్‌ ఆస్తుల విలువను ప్రభుత్వం రోజురోజుకూ తగ్గిస్తున్నారన్న కన్నా, ఈ విషయంలో సంస్థ యాజమాన్యం, ప్రభుత్వం కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. అగ్రిగోల్డ్‌ కుంభకోణంపై తక్షణమే సీబీఐతో విచారణ చేయించాలని కన్నా ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తగిన న్యాయం చేయకపోవడంతో బాధితులు అత్మహత్యలకు పాల్పడే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏటికేడు అగ్రిగోల్డ్‌ ఆస్తి విలువను తక్కువ చేసి చూపిస్తున్నారన్నారని, రూ.500 కోట్ల డిపాజిట్లు ఉన్నాయని ఆర్థిక మంత్రి యనమలే స్వయంగా
చెప్పారన్నారు. ఆ తర్వాత కేవలం రూ.6లక్షలే ఉన్నాయని మాట మార్చారని పేర్కొన్నారు. అగ్రిగోల్డ్‌ ఆస్తులను కొట్టేయడానికి ప్రభుత్వ పెద్దలు ప్రయత్నిస్తున్నారన్నారు. విజయవాడలో రూ.30కోట్లున్న ఆస్తులను కేవలం రూ.11 కోట్లకే ఇచ్చేశారని కన్నా అన్నారు. అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం జరిగే వరకు బీజేపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. చంద్రబాబు ఇప్పటికైనా స్పందించి అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
ఆంబోతు రాజకీయాలు చేసేది టీడీపీ నేతలే – రామ్‌మాధవ్‌
అగ్రి గోల్డ్‌ కుంభకోణం వెనుక ఎవరున్నారో ప్రజలకు తెలియ చెప్పాలని భారతీయ జనతాపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అన్నారు. అగ్రి గోల్డ్‌ బాధితులు ఢిల్లీ వచ్చి తమను కలిశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై బాధితులు ఆవేదన వ్యక్తం చేశారన్నారుని, అగ్రిగోల్డ్‌ బాధితులకు అండగా నిలవాలని భాజపా నిర్ణయించిందన్నారు. అందులో భాగంగా అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం జరిగేలా తాను ఐదురోజుల రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు రామ్‌మాధవ్‌ తెలిపారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుందని, కేవలం దోచుకోవటమే పనిగా ఆ పార్టీనేతలు పెట్టుకున్నట్లుగా కనిపిస్తుందని అన్నారు. టీడీపీ తెలుగు దోపిడీ ప్రభుత్వంలా మారిందని విమర్శించారు. ప్రభుత్వానికి జవాబుదారీతనం ఉండాలని, టీడీపీ నేతలు నీచమైన భాష మాట్లాడుతున్నారన్నారు. ఆంబోతు రాజకీయాలు చేస్తోంది టీడీపీ నేతలేనని అన్నారు. ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ఇప్పటికైన టీడీపీ నేతలు తీరు మార్చుకోకపోతే గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
విభజన సమయంలో ఎన్నో ఆకాంక్షలతో ప్రభుత్వాలను గెలిపించారని.. కాని అవినీతిలో తెలంగాణ 2 స్థానంలో.. ఏపీ 4వ స్థానంలో ఉందని గుర్తు చేశారు. అభివృద్ధి కోసం ప్రజలు అధికారం కట్టబెడితే.. ప్రభుత్వాలు మాత్రం అవినీతిగా మారిపోయాయని విమర్శించారు. కేంద్రంపై నిందలు వేస్తూ.. ఏపీ ప్రభుత్వం ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తుందన్నారన్నారు. ఏపీకి ¬దా సాధ్యంకాదని.. సాయం చేస్తామని కేంద్రం చెప్పిందని, అయినా ఆ పదాన్నే పట్టుకొని ప్రభుత్వం అభివృద్ధి అవసరం లేదంటోందన్నారు. కేంద్రం అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పేలని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. అగ్రిగోల్డ్‌ బాధితుల్ని ఆదుకోవడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని రాంమాధవ్‌ అన్నారు. అగ్రిగోల్డ్‌ ఆస్తుల్ని కొనుగోలు చేసేందుకు వచ్చిన సంస్థల్ని భయపెడుతున్నారని విమర్శించారు. బాధితుల్ని ఆదుకునేందుకు పరిష్కార మార్గాలున్నా.. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అడ్డుపడుతోందన్నారు. ఆస్తుల వేలం విషయంలో కుంభకోణం జరుగుతోందని అందరికి అర్థమవుతోందని.. బాధితులకు న్యాయం చేసే వరకు బీజేపీ పోరాటం కొనసాగిస్తుందన్నారు. ఈకార్యక్రమంలో బీజేపీ స్థానిక బీజేపీ నేతలు  గోకరాజు గంగరాజు, మాణిక్యాల రావు తదితరులు పాల్గొన్నారు.