ఏపీ ప్రభుత్వానికి గవర్నర్‌ జలక్‌

– చుక్కల భూములపై ఆర్డినెన్స్‌ తిరస్కరణ
– గవర్నర్‌, ఏపీ ప్రభుత్వం మధ్య మరోసారి తలెత్తిన వివాదం
– గవర్నర్‌ తీరుపై మండిపడుతున్న పార్టీ నేతలు
– నేరుగా బిల్లు తెచ్చే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం?
అమరావతి, జనవరి30(జ‌నంసాక్షి) : తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌, ఏపీ ప్రభుత్వం మధ్య మరోసారి వివాదం తలెత్తింది. చుక్కల భూములపై ఆంధప్రదేశ్‌ ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్‌ను గవర్నర్‌ నరసింహన్‌ తిరస్కరించారు. ఏపీ ప్రభుత్వం పంపిన రెండు ఆర్డినెన్స్‌ల్లో ఏపీ అసైన్డ్‌మెంట్‌ ల్యాండ్‌ ఆర్డినెన్స్‌కు మాత్రమే గవర్నర్‌ ఆమోద ముద్ర వేశారు. దరఖాస్తుకు కనీస పరిష్కార సమయం రెండు నెలలు పెట్టడంపై అభ్యంతరం తెలిపిన గవర్నర్‌.. చుక్కల భూములపై ఆర్డినెన్స్‌ను తిప్పి పంపారు. దీంతో గవర్నర్‌, ఏపీ ప్రభుత్వం మధ్య అభిప్రాయ భేదాలు మరోసారి బయటపడ్డాయని విశ్లేషకులు అంటున్నారు.
పేదలకు ప్రభుత్వం ఇచ్చిన భూములను ఐదేళ్ల తర్వాత అమ్ముకునేలా ఇప్పటివరకు ఉన్న నిబంధనలను ఏపీ ప్రభుత్వం మార్చింది. వీటిని 20ఏళ్ల తర్వాత మాత్రమే అమ్ముకునేలా చర్యలు తీసుకుంటూ ఆర్డినెన్స్‌ రూపకల్పన చేసింది. దీనిపై ఎలాంటి అభ్యంతరాలు తెలపకుండా గవర్నర్‌ ఆమోదముద్ర వేశారు. అయితే చుక్కల భూములపై జారీచేసిన ఆర్డినెన్స్‌ను మాత్రం గవర్నర్‌ ప్రభుత్వానికి తిప్పి పంపారు. ఆర్డినెన్స్‌లోని విషయాలు సహేతుకంగా లేవని, మరిన్ని వివరాలు సమర్పించాలని కోరుతూ ఆర్డినెన్స్‌ను తిప్పి పంపినట్లు రాజ్‌భవన్‌ వర్గాలు చెబుతున్నాయి. గవర్నర్‌ తీరుపై అధికార పార్టీ నేతలు మండిపడుతున్నారు. గవర్నర్‌ నరసింహన్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. గతంలో నాలా ఆర్డినెన్స్‌ విషయంలోనూ గవర్నర్‌ ఇలాగే వ్యవహరించారని గుర్తుచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్‌లకు గవర్నర్‌ ఆమోదం తెలపడం అన్నది సాధారణ విషయమే. చాలా ప్రత్యేక సందర్భాల్లో తప్ప గవర్నర్‌ వీటిని తిరస్కరించరు. అయితే ప్రభుత్వం, గవర్నర్‌ మధ్య గ్యాప్‌ ఉండటంతోనే తరుచూ ఇలాంటి సమస్య తలెత్తుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
నేరుగా బిల్లుపెట్టే యోచనలో ఏపీ సర్కారు?
చుక్కల భూముల (డాటెడ్‌ ల్యాండ్స్‌)పై నేరుగా బిల్లు తేవాలని ఆంధప్రదేశ్‌ సర్కారు యోచిస్తున్నట్లు సమాచారం. అసైన్‌లాండ్స్‌, డాటెడ్‌ ల్యాండ్స్‌పై సర్కారు రూపొందించి పంపిన రెండు ఆర్నినెన్స్‌ల్లో చుక్క భూముల ఆర్డినెన్స్‌ను గవర్నర్‌ తిప్పిపంపిన విషయం తెలిసిందే. దరఖాస్తు పరిశీలన గడువుపై గవర్నర్‌ అభ్యంతరం వ్యక్తం చేయడంతో దాన్ని సరిచేయడమో, లేక పున:పరిశీన చేసి మళ్లీ గవర్నర్‌కు పంపడం కంటే ఏకంగా బిల్లు రూపొందించి అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టడం ఉత్తమం అన్న ఆలోచనలో సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ముంచుకు వస్తున్నందున అత్యవసరమైతే తప్ప ఇవే ఆఖరి సమావేశాలని గవర్నర్‌ గతంలో ప్రకటించి ఉండడంతో సర్కారు ఎలా అడుగులు వేస్తుందో చూడాలి.