ఏపీ మండలి ఛైర్మన్‌గా షరీఫ్‌

– ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు వెల్లడించిన ఇన్‌చార్జ్‌ చైర్మన్‌
– చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన షరీఫ్‌
అమరావతి, ఫిబ్రవరి7(జ‌నంసాక్షి) : ఏపీ శాసన మండలి ఛైర్మన్‌గా తెదేపా సీనియర్‌ నేత, ప్రభుత్వ విప్‌ ఎం.ఎ. షరీఫ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పదవికి ఒకే నామినేషన్‌ దాఖలు కావడంతో షరీఫ్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు గురువారం మండలి ఇన్‌ఛార్జ్‌ ఛైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం ప్రకటించారు. అనంతరం సీఎం చంద్రబాబు, ఇతర నేతలు ఆయన్ను అభినందించి చైర్మన్‌ స్థానం వద్దకు తొడ్కొని వెళ్లారు. ఆ తర్వాత షరీఫ్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. షరీఫ్‌ వ్యక్తిత్వాన్ని కొనియాడారు. తెలుగుదేశం పార్టీకి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఫరూక్‌ని మంత్రిగా, షరీఫ్‌ను మండలి ఛైర్మన్‌గా చేయటం ద్వారా మైనార్టీలకు రెండు ముఖ్య పదవులు ఇస్తామని చెప్పిన మాట నిలబెట్టుకున్నామన్నారు. రాష్ట్రంలో 78.5శాతం ప్రజలు తెదేపా ప్రభుత్వం పట్ల సంతోషంగా ఉన్నారని తెలిపారు. షరీఫ్‌ నేతృత్వంలో శాసనమండలి సజావుగా సాగాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని శాసనమండలి గౌరవం నిలబెడతానని, ప్రజలకు సేవ చేస్తానని నూతన ఛైర్మన్‌ షరీఫ్‌ చెప్పారు. ఇదిలాఉంటే ఎం.ఎ.షరీఫ్‌ పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో 1955 జనవరి 1న జన్మించారు. స్థానిక వై.ఎన్‌.కాలేజీలో బీకాం, భోపాల్‌లో ఎంకాం, ఎల్‌ఎల్‌బీ చదివారు. విద్యార్థి రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించిన షరీఫ్‌.. ఎన్టీఆర్‌ తెదేపాను ప్రారంభించిన తొలినాళ్లలో పార్టీలో చేరారు. అప్పటి నుంచీ పార్టీకి సేవలందిస్తూ, వివిధ పదవులు చేపట్టారు. ప్రస్తుతం ఆయన తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగానూ పనిచేస్తున్నారు. ఆయన సేవల్ని గుర్తించిన పార్టీ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది. శాసనమండలిలో ప్రభుత్వ విప్‌గాను నియమించింది.