ఏపీ రాజకీయాలు ఇక్కడ చేయొద్దు

రెండు పార్టీల మధ్య పంచాయతీ అక్కడే తేల్చుకోవాలి
చంద్రబాబు అరెస్టుపై మా నేతలు స్పందిస్తే అది వ్యక్తిగతం : మంత్రి కేటీఆర్‌
చంద్రబాబు అరెస్ట్‌కు తెలంగాణ రాజకీయాలకు ఏం సంబంధం అని మంత్రి కెటిఆర్‌ ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్ట్‌ అయింది ఆంధప్రదేశ్‌లో అని… ధర్నాలు చేయాల్సింది అక్కడ.. కానీ హైదరాబాద్‌లో రాజకీయ ర్యాలీలు తీస్తున్నారరని,టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై మంత్రి కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రెండు రాజకీయ పార్టీల మధ్య ఘర్షణ జరుగుతోంది. ఏపీ రాజకీయాలలో మేము తల దూర్చ దలుచుకోలేదని అంటూ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు.మంగళవారం విరీడియాతో మాట్లాడుతూ.. పక్కింట్లో పంచాయతీని ఇక్కడ తీర్చుకుంటారా అని అడిగారు. శాంతి భద్రతల సమస్య తలెత్తితే ఇక్కడ ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది కదా అని అన్నారు. వాళ్ల ఘర్షణకు హైదరాబాద్‌ వేదిక కావాలా అని ప్రశ్నించారు. రాజమండ్రి, అమరావతి, కర్నూలులో చేయకుండా ఇక్కడ రాద్దాంతం ఎందుకు అని మంత్రి ప్రశ్నించారు.ఇది అచ్చంగా రెండు రాజకీయ పార్టీల తగాదా. ఆ రెండు పార్టీలకు ఇక్కడ ఉనికి లేదు.. ఇక్కడ ఎందుకు పంచాయితీ. చంద్రబాబు న్యాయ పోరాటం చేస్తున్నారు. ఆయనకు న్యాయస్థానంలో ఏం న్యాయం జరుగుతుందో అది జరుగుతోంది. కోర్టుల్లో ఉండగా బయటకు వచ్చి కామెంట్‌ చేయొచ్చా. నాకు లోకేశ్‌ , జగన్‌ , పవన్‌ కళ్యాణ్‌ అందరూ దొస్తులే. నాకు ఆంధ్రలో తగాదాలు లేవు. ఇక్కడ లేని పంచాయితీ ఎందుకు పెడుతున్నారు. ఇక్కడ ఉన్న ఆంధ్ర ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు. దాన్ని మాకు ఎందుకు చుడుతున్నారు. నాకు లోకేశ్‌ ఫోన్‌ చేసి ర్యాలీలకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని అడిగారు. శాంతి భద్రతలు ఏం కావాలని అడిగా. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఐటి కారిడార్‌లో ఆందోళనలు జరగలేదు. అప్పటి ప్రభుత్వాలు అలా చేయలేదు. మాకు ఒక పార్టీగా ఆ అంశంపై ఎలాంటి ఆసక్తి లేదు.. మా పార్టీ వాళ్లు ఏద్కెనా మాట్లాడితే అది వారి వ్యక్తిగతం. దానికి మా పార్టీకి సంబంధం లేదు.. అది పార్టీ స్టాండ్‌ కాదన్నారు. చంద్రబాబును అరెస్ట్‌ చేసిన తర్వాత హైదరాబాద్‌లో ఆందోళనలు జరుగుతూంటే.. పోలీసులు అడ్డుకున్నారు. ఈ అంశంపై నారా లోకేష్‌.. తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు ఫోన్‌ చేశారు. హైదరాబాద్‌లో ఆందోళనలకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబును అరెస్ట్‌ చేస్తే హైదరాబాద్‌లో ఆందోళనలు చేయడం ఏమిటని కేటీఆర్‌ అన్నారు. చంద్రబాబు అరెస్ట్‌ రెండు పార్టీలసమస్య అన్నారు. ధర్నాలు, ర్యాలీలు ఏపీలో చేసుకోవాలని.. తెలంగాణలో వద్దని స్పష్టం చేశారు. అయితే తెలంగాణలోని పలు చోట్ల చంద్రబాబుకు మద్దతుగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో అనేక చోట్ల.. నల్లగొండ జిల్లా కోదాడతో పాటు హైదరాబాద్‌ నిజామాబాద్‌ వంటి చోట్ల కూడా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అక్కడ ఎవరూ పెద్దగా అడ్డుకోవడం లేదు. మరో వైపు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సహా అనేక మంది బీఆర్‌ఎస్‌ నేతలు చంద్రబాబు అరెస్టును ఖండిరచారు. రాజకీయ కక్ష సాధింపుల కోసమే అరెస్టు చేశారని ఇలాంటివి రాజకీయాల్లో తగవన్నారు. ఎల్బీనగర్‌లో ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ కూడా నిర్వహించారు. మంత్రి మల్లారెడ్డి కూడా ఖండిరచారు. అయితే వీరంతా తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘంగా ఉండి.. చంద్రబాబుకు సన్నిహితంగా ఉన్న వారే. తర్వాత రాజకీయ పరిణామాల్లో బీఆర్‌ఎస్‌లో చేరారు. గతంలో చంద్రబాబును తీవ్రంగా విమర్శించారు కూడా. గత ఎన్నికలకు ముందు చంద్రబాబును తీవ్రంగా దూషించిన బీఆర్‌ఎస్‌ నేత మోత్కుపల్లి నర్సింహులు కూడా చంద్రబాబు అరెస్టును ఖండిరచి.. ఓ రోజు దీక్ష చేసి.. జగన్‌ పై తీవ్ర విమర్శలు చేశారు.