ఏ మొహం పెట్టుకుని మోడీ వస్తున్నారు


రాష్ట్రానికి ఎక్కడిక్కడ నిలదీయండి
కిషోర్‌ చంద్రదేవ్‌ రాకను ఆహ్వానించిన బాబు
కెటిఆర్‌ వ్యాఖ్యలపై మండిపడ్డ చంద్రబాబు
టిడిపిలో చేరిన మాజీమంత్రి కిషోర్‌ చంద్రదేవ్‌
అమరావతి,ఫిబ్రవరి24(జ‌నంసాక్షి): ఏ ముఖం పెట్టుకుని ప్రధాని మోదీ తిరిగి రాష్ట్రానికి  వస్తున్నారని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు మరోమారు ప్రశ్నించారు. రాష్ట్రానికి  వస్తున్న మోదీని ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి  న్యాయం చేసే వరకు పోరాటం వదిలిపెట్టేది లేదన్నారు. మోదీ, కేసీఆర్‌, జగన్‌ కలిసి తెదేపాపై కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. అవినీతి పరులకు కేంద్రం మద్దతిస్తోందన్నారు. జగన్‌ రూ.43వేల కోట్లు దోచుకున్నట్లు సీబీఐ ఛార్జిషీట్‌ నమోదైందని, అయినా జగన్‌పై చర్యలు తీసుకోవడం లేదన్నారు.కేంద్ర మాజీ మంత్రి కిశోర్‌ చంద్రదేవ్‌లాంటి మంచి వ్యక్తులు తెదేపాలోకి రావాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి, తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. రాజకీయాలకు ఆయన హుందాతనం, గౌరవం తెచ్చారని కొనియాడారు. రౌడీల పార్టీలోకి వెళ్లలేకే ఆయన తెదేపాలో చేరారని చెప్పారు. కిశోర్‌ చంద్రదేవ్‌ పార్టీలో చేరిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. వైకాపా నేతలు భాజపాతో కుమ్మక్కై దాడులు చేయిస్తున్నారని.. వారికి తెరాస సహకరిస్తోందని మండిపడ్డారు. ఈ సందర్భంగా మోదీ పర్యటనపైనా, కేటీఆర్‌ వ్యాఖ్యలపైనా వ్యాఖ్యలు చేశారు. బాక్సైట్‌ను ప్రైవేటు పరం చేసింది వైస్‌ రాజశేఖర్‌రెడ్డేనని, గిరిజనుల సంపద విదేశాలకు దోచిపెట్టేందుకు ఆయన యత్నించారని ఆరోపించారు. వైఎస్‌ చర్యలను ఆనాడు కిశోర్‌ చంద్రదేవ్‌
వ్యతిరేకించారని గుర్తు చేశారు. బాక్సైట్‌ తవ్వకాలకు సంబంధించి లైసెన్స్‌లను తాను రద్దు చేశానని చెప్పారు. బాక్సైట్‌ తవ్వకాలను ఆపిన ఘనత తెదేపాదేనన్నారు. జగన్‌ సీఎం అవుతారని కేటీఆర్‌ మాట్లాడడం దారుణమన్నారు. అభివృద్ధిలో రాష్ట్రంతో పోటీ పడాలని సవాల్‌ విసిరారు. రాష్ట్రం అభివృద్ధి చెందకూడదనేదే కేసీఆర్‌ లక్ష్యమని ఆరోపించారు. అభివృద్ధి వ్యతిరేకులతో జగన్‌ కలిసి పనిచేస్తున్నారని, బిహార్‌ నుంచి వచ్చిన ప్రశాంత్‌ కిశోర్‌ సలహాలతో కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. డబ్బు ఎవరు ఎక్కువగా ఇస్తామంటే వారికే టికెట్‌ ఇస్తున్నారని, వైకాపా తరహా దిగజారుడు రాజకీయాలు తన జీవితంలో చూడలేదన్నారు. భాజపా, తెరాస, వైకాపా కలిసి కుట్ర రాజకీయాలు చేస్తున్నాయని, ముసుగు తీసి ఆ మూడు పార్టీలు కలిసి పోటీ చేయాలన్నారు. తెదేపాకు వ్యతిరేకంగా పనిచేయాలని వ్యాపారులను, పారిశ్రామికవేత్తలను కేసీఆర్‌ రెచ్చగొడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. గట్టిగా మాట్లాడిన వారిపై భాజపా ఐటీ దాడులు చేయిస్తూ భయపెడుతోందన్నారు. కేంద్ర మాజీ మంత్రి, ఇటీవల కాంగ్రెస్‌ను వీడిన కిశోర్‌ చంద్రదేవ్‌ తెలుగుదేశం పార్టీలో చేరారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. చంద్రబాబు ఆయనకు కండువా కప్పి స్వయంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు విజయనగరం, విశాఖ జిల్లాల్లోని ఇతర పార్టీలకు చెందిన పలువురు నేతలు తెదేపాలో చేరారు. కాంగ్రెస్‌ పార్టీని ఇటీవలే వీడిన కిశోర్‌ చంద్రదేవ్‌.. తెదేపాలో చేరుతున్నట్లు ఇది వరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌ పార్టీలో సుదీర్ఘకాలం పాటు ఉన్న కిశోర్‌ చంద్రదేవ్‌.. ఐదుసార్లు లోక్‌సభకు, ఒకసారి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో అరకు లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా పోటీచేసి గెలిచారు. 2011 నుంచి 2014 వరకు మన్మోహన్‌ సింగ్‌ కేబినెట్‌లో గిరిజన వ్యవహరాలు, పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రిగా పనిచేశారు.