ఐటీ దాడులపై టీడీపీ రాద్ధాంతం చేస్తుంది
– బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ
గుంటూరు, అక్టోబర్15(జనంసాక్షి) : ఐటీ దాడులపై టీడీపీ రద్దాంతం చేస్తుందని, టీడీపీ నేతలపై ఐటీ అధికారులు దాడులు చేయడమే నేరమన్నట్లు మాట్లాడుతున్నారని టీడీపీ నేతల తీరుపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. సోమవారం గుంటూరులో పర్యటించిన కన్నా.. విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. గతంలో ఏపీలో ఎప్పుడూ ఐటీ దాడులు జరగలేదా అని ప్రశ్నించారు. మొన్నటి వరకు బాబ్లీ కేసు పేరుతో నాటకాలు ఆడారని, ఇప్పుడు ఐటీ దాడుల పేరుతో నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. తప్పుడు పనులను ప్రశ్నించిన రాజ్యాంగ సంస్థలను అవమానించడం తగదన్నారు. టీడీపీ నేతలు అక్రమ సంపాదనతో ఏదైనా చేస్తామనే ధీమాతో ఉన్నారని తెలిపారు. సీఎం రమేష్, సుజనా చౌదరి కంపెనీలలో ఐటీ సోదాలు చేస్తే ఎందుకంత ఉలికిపాటని ప్రశ్నించారు. టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల నివాసంలో ఐటీ సోదాలు జరిగితే టీడీపీ నేతలు ఎందుకు స్పందించలేదని కన్నా లక్ష్మీనారాయణ నిలదీశారు. రాజకీయాలను అడ్డం పట్టెకొని పన్నులు, బ్యాంకు లోన్లు, కరెంట్ బిల్లులు, జీఎస్టీ ఎగ్గొట్టొచ్చు, అడగటానికి వీళ్లేవరు.. అడిగితే నరేంద్ర మోదీ కక్షసాధిస్తున్నారని అనే సిద్ధాంతంతో టీడీపీ ముందుకు సాగుతుందని, ఇది సరికాదన్నారు. రాజ్యాంగాన్ని కాపాడతానని ప్రమాణం చేసిన చంద్రబాబు, రాజ్యాంగ బద్దంగా పనిచేసే సంస్థలను ఎదుర్కోవటం, ఆ సంస్థలను అవమాన పర్చడం ఎంత వరకు సంమంజసమని ప్రశ్నించారు. ధర్మాబాద్ కోర్టులో 2013లో అక్కడ కేసు నమోదైందని, అప్పటి నుంచి 37 సార్లు వాయిదాకు వెళ్లలేదని, తెలంగాణ ఎన్నికలు వచ్చిన సమయంలో దానిపై డ్రామాలాడుతున్నారన్నారని విమర్శించారు. సీఎం రమేష్‌కు కాంట్రాక్ట్ లు, వ్యాపాలు ఉన్నాయని, రాజకీయాలను అడ్డుపెట్టుకొని అక్రమ సంపాదనలు చేస్తే.. దాడులు చేయవద్దని అనడం దేనికి నిదర్శనమన్నారు. టీడీపీ నేతల డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని సరైన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.