ఐటీ పేరుతో.. రాష్ట్రాన్ని లూటి చేస్తున్నారు
– భూకేటాయింపుల్లో భూ కుంభకోణానికి తెరలేపారు
– కంపెనీలకు కేటాయించిన భూముల వివరాలు వెల్లడించాలి
– సోదాల సమయంలో రమేష్ కోట్లరూపాయలు దారిమళ్లించాడు
– రమేష్‌ను రాజ్యసభకు పంపినందుకు బాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలి
– సీఎం రమేష్‌పై ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేస్తా
– 2019 తరువాత టీడీపీ కనుమరుగు ఖాయం
– విలేకరుల సమావేశంలో బీజేపీ నేత జీవీఎల్ నర్సింహారావు
విజయవాడ, అక్టోబర్19(జనంసాక్షి) : రాష్ట్రంలో ఐటీ కంపెనీల పేరుతో చంద్రబాబు భూ కుంభకోణం చేస్తున్నారని, ఇప్పటి వరకు కంపెనీలకు కేటాయించిన భూముల వివరాలు, ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారో ప్రకటించాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు డిమాండ్ చేశారు. శుక్రవారం విజయవాడలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.. ప్రభుత్వం కేటాయించిన కంపెనీలన్నీ లోకేష్ బినావిూలేనని విమర్శించారు. ఇష్టం వచ్చినట్లు భూములు కేటాయిస్తున్నారని మండిపడ్డారు. సమాచార చట్టం ద్వారా ఐటీ కంపెనీలకు కేటాయించిన వివరాలు అడిగితే ఎందుకు ఇవ్వడం లేదని సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. లోకేష్ తన బినావిూలకు ఐటీ కంపెనీల పేరుతో వేల కోట్ల రూపాయల భూమలు కేటాయిస్తున్నారని విమర్శించారు. ప్రజా ధనాన్ని లూటీ చేయడానికి లోకేష్‌కు ఐటీ మంత్రి పదవి ఇచ్చారని ఆరోపించారు. లోకేష్ అర్హతలపై పవన్ కళ్యాణ్ అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలని కోరారు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే చంద్రబాబు శ్రీకాకుళం జిల్లాలో తుఫాన్ బాధితుల దగ్గరకు వెళ్తున్నారని చెప్పుకొచ్చారు. సహాయక చర్యలు తక్కువ.. ప్రచారం ఎక్కువ అని ఎద్దేవా చేశారు. కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రిపోర్టు ఇవ్వాల్సి ఉందని జీవీఎల్ తెలిపారు. సీఎం రమేష్ సోదాలు జరుగుతున్న సమయంలో కోట్ల రూపాయలు దారిమళ్లించాడని జీవీఎల్ ఆరోపించారు. సీఎం రమేష్‌ను రాజ్యసభకు పంపినందుకు చంద్రబాబు నాయుడు ఏపీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వెంటనే రాజ్యసభ సభ్యత్వం నుంచి తొలగించాలని కోరారు. జాతీయస్థాయిలో వచ్చిన కథనాలపై సీఎం రమేశ్ ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నించారు. విూసం మెలేసిన సీఎం రమేష్ జాతీయ స్థాయిలో వచ్చిన కథనాలతో విూసం తీయించుకుంటారా అని సవాల్ విసిరారు. ఒక అవినీతి పరుడైన సీఎం రమేష్‌ని పబ్లిక్ కమిటీలో స్థానం కల్పించాలని సీఎం ఎలా రికమెండేషన్ చేస్తారని నిలదీశారు. సీఎం రమేష్ తీరుపై ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. సీఎం రమేష్ వ్యవహరించే తీరు, పార్లమెంటు సభ్యులకు ఉండాల్సిన లక్షణాలు ఏవీ లేవని అభిప్రాయపడ్డారు. సీఎం రమేష్ అవినీతిపై కూడా ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. సీఎం రమేశ్ వాడే బాష పార్లమెంటు సంప్రదాయానికి విరుద్ధంగా ఉందన్నారు. టీడీపీలో విలువలు లేవని చెప్పడానికి సీఎం రమేష్ ఒక ఉదాహరణ అని చెప్పారు. 2019 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో టీడీపీ కనుమరుగు కానుందని జీవీఎల్ జోస్యం చెప్పారు. సీఎం రమేష్ వాస్తవాలను జీర్ణించుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. అందుకే ఆయనపై విమర్శలు చేసిన వారిపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం రమేష్ సారాయి కాంట్రాక్టర్, వీధి రౌడీలా మాట్లాడుతున్నారని జీవీఎల్ ఎద్దేవా చేశారు.