ఐదు నెలల గరిష్ఠ స్థాయికి సెన్సెక్స్
– నిఫ్టీకి 80 పాయింట్లు లాభం
ముంబయి, .జులై9(జనం సాక్షి) : దలాల్‌స్టీట్ర్ మళ్లీ కళకళలాడింది. కొనుగోళ్ల అండతో మార్కెట్ జోరందుకుంది. దేశీయ కార్పొరేట్ కంపెనీల తైమ్రాసిక ఫలితాలు ఈ వారంలో వెలువడనున్నాయి. ఈ ఫలితాలపై సానుకూలంగా ఉన్న మదుపర్లు సోమవారం నాటి ట్రేడింగ్‌లో కొనుగోళ్ల వైపు మొగ్గుచూపారు. దీంతో సూచీలు భారీ లాభాలను సొంతం చేసుకున్నాయి. బ్యాంకింగ్, లోహ, ఐటీ రంగాల్లో కొనుగోళ్లు జరగడంతో సోమవారం ఉదయం నుంచే సూచీలు జోరు కనబర్చాయి. మార్కెట్ ఆరంభంలో 250 పాయింట్ల లాభంతో ట్రేడింగ్‌ను మొదలుపెట్టిన బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్ ఒక దశలో 300 పాయింట్లకు పైగా దూసుకెళ్లింది. చివర్లో కాస్త అమ్మకాలకు పాల్పడటంతో ఒత్తిడికి గురైనప్పటికీ లాభాలను నిలబెట్టుకుంది. మార్కెట్ ముగిసే సమయానికి 277 పాయింట్లు లాభపడి 35,935 వద్ద స్థిరపడింది. ఐదు
నెలల్లో సెన్సెక్స్ గరిష్ఠస్థాయి ఇదే. అటు నిఫ్టీ కూడా 80 పాయింట్ల లాభంతో 10,853 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 68.72గా కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈలో ఏషియన్ పెయింట్స్, యస్ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, వేదాంతా లిమిటెడ్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్లు లాభపడగా.. ఆల్టాట్రెక్ సిమెంట్, టీసీఎస్, టైటాన్, హెచ్‌డీఎఫ్‌సీ, హీరోమోటార్స్ షేర్లు నష్టపోయాయి.