ఐదు రాష్ట్రాల్లో మోగిన ఎన్నికల నగారా
పశ్చిమ బెంగాల్,తమిళనాడు,కేరళ, అసోం,పుదుచ్చేరి ఎన్నికల నిర్వహణ
పశ్చిమ బెంగాల్లో మొత్తం 8 దశల్లో,అసోంలో 3 దశల్లో పోలింగ్
పుదుచ్చేరి, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఏప్రిల్ 6న పోలింగ్
వెంటనే అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్
మే 2న ఎన్నికల కౌంటింగ్..అదేరోజు ఫలితాల వెల్లడి
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అరోరా
న్యూఢిల్లీ,ఫిబ్రవరి 26(జనంసాక్షి):నాలుగు రాష్టాలైన్ర తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం సహా పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. శుక్రవారం న్యూఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కార్యాలయంలో నిర్వహించిన విూడియా సమావేశంలో ఈ వివరాలను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అరోరా వెల్లడించారు. మొత్తంగా ఐదు అసెంబ్లీల్లో 824 స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలు జరగనున్న పరిధిలో 18.68 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఎన్నికల నిర్వహణకు 2.7 లక్షల సిబ్బందిని వినియోగించనున్నట్లు ఈసీ ప్రకటించింది. ఎన్నికలకు సంబంధించి నియమావళి వెంటనే అమల్లోకి వచ్చినట్లు ప్రకటించారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా సునీల్ ఆరోరా ఈ మేరకు ఆయా రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ను విూడియా సమావేశం ద్వారా వెల్లడించారు. పశ్చిమ బెంగాల్‌లోని 294 శాసనసభ స్థానాలకు, తమిళనాడులోని 234 స్థానాలకు, కేరళలోని 140 స్థానాలకు, అసోంలోని 126 స్థానాలకు, పుదుచ్చేరిలోని 30 శాసనసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్‌ను సీఈసీ ప్రకటించింది. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి జరిగే ఈ ఎన్నికల పోలింగ్ ఫలితాలను మే 2వ తేదీన ప్రకటించనున్నట్లు సీఈసీ తెలిపారు. కరోనా జాగ్రత్తలతో ఎన్నికలు నిర్వహించనున్నట్లు అరోరా తెలిపారు. పోలింగ్ సమయాన్ని గంటసేపు పెంచుతున్నట్లు వెల్లడించారు. ఎన్నికలు జరిగే ఈ రాష్ట్రాల్లో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లు పేర్కొన్నారు. నాలుగు రాష్ట్రాల్లో అభ్యర్థుల ఎన్నికల ఖర్చు రూ.30.8 లక్షలకు పెంచుతున్నట్లు తెలిపారు. ఎలాంటి అవకతవకలున్నా సి-విజిల్ యాప్‌కు ఫిర్యాదు చేయొచ్చన్నారు. ఇకపోతే అసోంలో మూడు దశల్లో ఎన్నికల నిర్వహణ జరగనుంది. మొదటి దశలో 47 స్థానాలకు మార్చి 2వ తేదీన నోటిఫికేషన్ విడుదల, మార్చి 27న పోలింగ్, రెండో దశలో 39 స్థానాలకు మార్చి 5న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఏప్రిల్ 1న పోలింగ్, మూడో దశలో 40 స్థానాలకు ఏప్రిల్ 6న పోలింగ్ నిర్వహణ. ఈ మూడు దశల పోలింగ్‌ను మే 2వ తేదీన కౌంటింగ్ చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు. పుదుచ్చేరి, కేరళ, తమిళనాడు ఈ మూడు రాష్ట్రాలకు కలిపి ఒకే విడతలో ఎన్నికలను నిర్వహించనున్నారు. ఏప్రిల్ 6న పోలింగ్ నిర్వహణ. మే 2వ తేదీన కౌంటింగ్ జరుగుతుంది.పశ్చిమ బెంగాల్లో మొత్తం 8 దశల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. మొదటి దశ పోలింగ్ మార్చి 27న, రెండో దశ పోలింగ్ ఏప్రిల్ 1న, మూడో దశ పోలింగ్ ఏప్రిల్ 6న, నాల్గొవ దశ పోలింగ్ ఏప్రిల్ 10, ఐదో దశ పోలింగ్ ఏప్రిల్ 17, ఆరో దశ పోలింగ్ ఏప్రిల్ 22, ఏడో దశ పోలింగ్ ఏప్రిల్ 26, ఎనిమిదో దశ పోలింగ్ ఏప్రిల్ 29న జరగనుంది. ఈ ఎనిమిది దశల పోలింగ్ కౌంటింగ్‌ను మే 2న చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు. ఎన్నికల ఫలితాలను మిగతా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటే మే 2న ప్రకటించ నున్నట్లు ఈసీ పేర్కొంది. తమిళనాడు అసెంబ్లీకి ఒకే దశలో పోలింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. 234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడు దక్షిణాదిలో కీలకమైన రాష్ట్రం. ఈ రాష్ట్రంలో ఏప్రిల్ 6న పోలింగ్ జరపనున్నట్లు ఈసీ తెలిపింది. ఇక ఫలితాలు మే 2న విడుదల కానున్నాయి. కేరళలో ఒకే దశలో పోలింగ్ నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. కేరళలో ఏప్రిల్ 6న పోలింగ్.. మే 2న కౌంటింగ్ నిర్వహిస్తారు. అదేవిధంగా ఏప్రిల్ 6న రాష్ట్రంలోని మల్లాపురం లోక్‌సభ ఉప ఎన్నిక నిర్వహిస్తారు. పుదుచ్చేరిలో ఒకే దశలో పోలింగ్ నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 30 అసెంబ్లీ స్థానాలున్న పుదుచ్చేరిలో ఏప్రిల్ 6న పోలింగ్ జరగనుంది. ఇక మే 2న కౌంటింగ్ నిర్వహిస్తారు.