ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు
వరంగల్ ఆస్పత్రిలో తల్లీబిడ్డలు క్షేమం
వరంగల్,ఆగస్ట్30(జనం సాక్షి): వరంగల్ సీకేఎం ఆసుపత్రిలో ఒకే కాన్పులో ముగ్గురు మగ పిల్లలు జన్మించిన సంఘటన బుధవారం జరిగింది. ఆసుపత్రి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ పద్మ తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు గ్రామానికి చెందిన గుండా రమ్య(26) పురిటినొప్పులతో ప్రసవం కోసం ఈనెల 28న ఆసుపత్రిలో చేరింది. వైద్యులు పరీక్షలు నిర్వహించగా ఆమె గర్భంలో ముగ్గురు శిశువులున్నారని గుర్తించారు. బుధవారం డాక్టర్ శ్వేతారెడ్డి, మత్తు వైద్యుడు డాక్టర్ అర్చునీ, పీజీ డాక్టర్‌శ్రీవిద్య స్టాఫ్ నర్సు ఉమారాణి, ఓటీ ఇన్‌ఛార్జి రత్నకుమారి శస్త్రచికిత్స ద్వారా ప్రసవం చేశారు. ముగ్గురిలో ఒకరు 2.3 కిలోలు, రెండో శిశువు 2.2 కిలోలు, మూడో శిశువు 2.1 కిలోలు ఉన్నారు. ప్రస్తుతం పిల్లలు, తల్లి ఆరోగ్యంగా ఉండటంతో వైద్యులు ఊపిరి పీల్చుకున్నారు.
——————