ఒలింపిక్స్‌ సంబురాలు పరిసమాప్తం

వీడ్కోలు వేడుకకు సర్వం సిద్ధం
పతకాల పట్టికలో అగ్ర భాగాన అమెరికా
లండన్‌, ఆగస్టు 12 (జనంసాక్షి) : లండన్‌ ఒలింపిక్స్‌కు అథ్లెట్లు వీడ్కోలు పలకనున్నారు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంట నుంచి ముగింపు ఉత్సవం ప్రారంభమవుతుంది. మరో ఒలింపిక్‌ కోసం మరో నాలుగేళ్లు వేచి చూడాల్సిందే. మెగా ఈవెంట్‌కు ఆదివారంతో తెరపడనుండడంతో అథ్లెట్లు తమ తమ అనుభవాలను, అనుభూతులను, గెలుపు, ఓటమిలను నెమరువేసుకున్నారు. విజేతలు తాము సాధించిన పతకాలతో సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఓటమి పాలైన వారు విశ్లేషణలతో.. మరింత మెరుగులు దిద్దుకునే ఆలోచనలతో ప్రణాళికలను రూపొందించుకుంటూ స్వదేశాలకు చేరుకున్నారు.. చేరుకుంటున్నారు.
పదహారు రోజుల పాటు కొనసాగిన పండుగలో మొత్తం 82 దేశాలు పతకాలు సాధించాయి. అత్యధిక స్వర్ణాలు.. 41 సాధించి అమెరికా అగ్ర భాగంలో నిలిచింది. అంతేగాక మొత్తం 96 పతకాలు సాధించి పతకాల పట్టికలో తొలి స్థానంలో తన పేరును అమెరికా పదిలపరుచుకుంది. అమెరికా అథ్లెట్లు 41 స్వర్ణాలు.. 26 రతజాలు.. 29 కాంస్య పతకాలు సాధించి తమ ఉన్నతిని చాటుకున్నారు. చైనా కొన్ని రోజుల పాటు అత్యధిక స్వర్ణాలు సాధించిన దేశంగా నిలిచినప్పటికీ.. చివరికొచ్చేసరికి పతకాల పట్టికలో రెండు స్థానంలో నిలిచింది. 37 స్వర్ణాలు.. 25 రజతాలు.. 21 కాంస్యాలు. మొత్తం 83 పతకాలతో ద్వితీయ స్థానంలో నిలిచింది. అమెరికా, చైనా కంటే ముందుండాలన్న లక్ష్యంతో బ్రిటన్‌ అథ్లెట్లు పోరాడిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. 26 స్వర్ణాలు, 15 రజతాలు, 18 కాంస్యాలు.. మొత్తం 59 పతకాలతో తృతీయ స్థానంతో సరిపెట్టుకున్నారు. రష్యాది నాల్గో స్థానం, దక్షిణ కొరియా ఐదో స్థానం, జర్మనీ 6.. ఫ్రాన్స్‌.. 7.. హంగేరి.. ఎనిమిది, ఆస్ట్రేలియా తొమ్మిది, ఇటలీ పది.. ఇలా పతకాల పట్టికలో తొలి పది స్థానాలను ఆయా దేశాల అథ్లెట్లు సాధించారు. ఇదిలా ఉండగా భారత అథ్లెట్లు పలువురు పోరాడి ఓడారు. అయినప్పటికీ 5 పతకాలను సాధించారు. భారత్‌ 52వ స్థానంలో ఉంది. మొత్తం 82 దేశాలు పతకాలను సాధించిన విషయం తెలిసిందే.
ఔను.. అతను లండన్‌ ఒలింపిక్స్‌లో ట్రిపుల్‌ పతకాన్ని సాధించాడు. జమైకా దేశం సంబరాల్లో మునిగిపోయింది. 100 మీటర్లు, 200 మీటర్ల పరుగులో బోల్ట్‌ బంగారు పతకాలు సాధించిన విషయం తెలిసిందే. శనివారం నాటి 400 మీ రిలేలో బోల్ట్‌, బ్లేక్‌, కార్టర్‌, ఫ్రాటర్‌లతో కూడిన జట్టు 36.84 సెకన్లలో రేసును ముగించి ప్రపంచ రికార్డు నెలకొల్పాయి. అమెరికాకు చెందిన కిమోన్స్‌, గాట్లిన్‌, టైసన్‌ గే, బెయిలీ లాంటి స్టార్లు ఉన్నప్పటికీ 37.04 సెకన్లతో రెండో స్థానంలో నిలిచింది. అయితే జమైకా అథ్లెట్ల జోరును ఆమెరికా అడ్డుకోలేకపోయింది. ఇదే రేసులో ట్రినిడాడ్‌, టుబాగోకు కాంస్యం దక్కింది.
ఏదిఏమైనా పరిశీలకుల అంచనాలు నిజం కానున్నాయి.. తాజా ఒలింపిక్స్‌ క్రీడల్లో అమెరికా అగ్రస్థానానికి ఎగబ్రాకే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయి.బీజింగ్‌ ఒలింపిక్స్‌లో ఆతిథ్య దేశం చైనా ధాటికి టాప్‌ ర్యాంక్‌ను కోల్పోయిన విషయం తెలిసిందే. శుక్రవారం నాటి క్రీడలు ముగిసే సమయానికి అమెరికా 41 స్వర్ణాలతో ఆధిక్యంలో ఉంది. అయితే ఆదివారం జరిగే పోటీల్లో అమెరికా మరో నాలుగు స్వర్ణాలు సాధించే అవకాశం ఉందని సమాచారం. చైనా ఒకటి రెండు స్వర్ణాలు మాత్రమే చేజిక్కుంచుకునే అవకాశాలు మాత్రమే ఉన్నాయని పలువురు క్రీడాభిమానులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.