ఓటమిని అంగీకరించిన ప్రధాని మోడీ

విూడియాకు మొహం చాటేయడమే నిదర్శనం
మోడీ విలేకరుల సమావేశంపై విపక్షాల ఎద్దేవా
న్యూఢిల్లీ,మే18(జ‌నంసాక్షి): ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఐదేళ్ల తరవాత, అదీ ఎన్నికల ప్రచారం ముగిసిన తరవాత నరేంద్ర మోదీ తొలిసారి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ముఖం చాటేశారని విపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ మాట్లాడుతూ.. ప్రతి నెలా రేడియో ద్వారా ప్రధాని వినిపించే ‘మన్‌ కీ బాత్‌’ చివరి ఎపిసోడ్‌ టీవీలో ప్రసారం అయినట్లు ఉందని వ్యాఖ్యానించారు. మోదీ కేవలం తొలి పలుకులకు మాత్రమే పరిమితమై ఎలాంటి ప్రశ్నలు స్వీకరించకపోవడాన్ని పరోక్షంగా అఖిలేశ్‌ ఎద్దేవా చేశారు. విలేకరులకు ప్రశ్నలు అడిగే అవకాశం ఇవ్వకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. లోక్‌తాంత్రిక్‌ జనతా దళ్‌ అధినేత శరద్‌ యాదవ్‌ స్పందిస్తూ.. భాజపాకు ఇక ఇదే చివరి విలేకరుల సమావేశమని అభిప్రాయపడ్డారు. ఐదేళ్ల పాలనా కాలంలో ఒక్కసారి కూడా ప్రధాని విూడియా ముందుకు రాకపోవడం విచారకరం. దీనిపై ప్రతిఒక్కరూ ప్రశ్నలు లేవనెత్తు తున్నారు. చివరి దశ పోలింగ్‌కి ముందు నిర్వహించిన సమావేశంలో ప్రధాని హావభావాలు చూస్తే ఆయన ఓటమిని అంగీకరించినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. అలాగే పార్టీకి ప్రభుత్వానికి ఇక చివరి విలేకరుల సమావేశమని కూడా స్పష్టమైందని ట్విటర్‌ వేదికగా శరద్‌ యాదవ్‌ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. మోదీ విలేకరుల సమావేశంపై జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఒమర్‌ అబ్దుల్లా మాట్లాడుతూ.. జర్నలిస్టుల ముసుగులో ఉన్న కొంతమంది భాజపా కార్యకర్తలకు ధన్యవాదాలు తెలపడం కోసం ఈ సమావేశాన్ని నిర్వహించారని విమర్శించారు. ఒకరిని అడిగిన ప్రశ్నలకు మరొకరు జవాబిచ్చే ఇలాంటి విలేకరుల సమావేశం ఎప్పుడూ చూడలేదని కాంగ్రెస్‌ నేత అహ్మద్‌ పటేల్‌ వ్యాఖ్యానించారు. ఈ సమావేశంతో భాజపా ఓటమి స్పష్టమైందని.. విలేకరుల ప్రశ్నలు ఎదుర్కొనే ధైర్యం కూడా ప్రధానికి లేదని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గె¬్లత్‌ అన్నారు. ప్రధానికి అమిత్‌ షా తోడుండడం అపూర్వమని, గొప్ప విలేకరుల సమావేశం అంటూ రాహుల్‌ ఎగతాళి చేశారు.